Vizianagaram District: అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:44 AM
వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లిన విశాఖకు చెందిన భక్తుడు కోరుమల్లి వెంకటరావు అనారోగ్యంతో దిక్కుతోచని స్థితిలో నెలన్నర నుంచి తిరుపతిలో ఫుట్ పాత్‌పైనే కాలం గడిపారు.
అనారోగ్యంతో అపస్మారక స్థితిలో సోదరుడు
తిరుపతిలో ఫుట్‌పాత్‌పై నెలన్నరగా అచేతనావస్థ
‘ఆంధ్రజ్యోతి’ చొరవతో నెల్లిమర్లలోని అక్కకు సమాచారం
ఎంపీ కలిశెట్టి సహకారంతో కారులో నెల్లిమర్లకు పయనం
నెల్లిమర్ల, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లిన విశాఖకు చెందిన భక్తుడు కోరుమల్లి వెంకటరావు అనారోగ్యంతో దిక్కుతోచని స్థితిలో నెలన్నర నుంచి తిరుపతిలో ఫుట్ పాత్‌పైనే కాలం గడిపారు. అతడి దీనావస్థపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతోపాటు, ‘ఆంధ్రజ్యోతి’ బృందం నేరుగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉంటున్న అతడి అక్కను కలసి సమాచారం అందించింది. మరోవైపు ఎంపీ కలిశెట్టి వాహనం సమకూర్చడంతో తిరుపతి నుంచి క్షేమంగా నెల్లిమర్లకు బయలుదేరారు. వివరాలివీ.. విశాఖకు చెందిన వెంకటరావు హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. భార్యా పిల్లలు లేరు. ఒక్కడే తిరుపతి దర్శనానికి వెళ్లారు. అనారోగ్యంతో కుప్పకూలి ఆసుపత్రిలో చేరారు. తన వివరాలు సరిగా చెప్పలేక పోవడంతో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యారు.
అప్పటి నుంచి తిరుపతిలోని అలిపిరి సమీపంలోని పేవ్‌మెంట్ మీద పడిఉన్న ఆయన్ను చూసి స్థానికంగా ఉన్న సామాజిక సేవకురాలు సుజాత చలించిపోయారు. ఆయనకు సపర్యలు చేస్తూ తిండి పెడుతున్నారు. ఎట్టకేలకు ఆయన పూర్తి స్థాయి స్పృహ వచ్చి తన అక్క విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని బృందావన్ వ్యాలీలో నివాసం ఉంటోందని, తన విషయం ఆమెకు తెలియజేయాలని కోరారు. దీనిపై ‘అక్కా.. వచ్చి నన్ను తీసుకెళ్లు’ శీర్షిన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. మరోవైపు ‘ఆంధ్రజ్యోతి’ బృందం కూడా నేరుగా నెల్లిమర్ల సమీపాన సారిపల్లి రోడ్డు బృందావన్ వ్యాలీలో నివాసం ఉంటున్న కోరుమల్లి వెంకటరావు.. అక్క అరుణా పాఠక్ ఇంటికి చేరుకుని అతడి పరిస్థితిని వివరించింది.
అలాగే, ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. అరుణా పాఠక్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. వెంకటరావును తిరుపతి నుంచి నెల్లిమర్ల తరలించేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చారు. దీంతో వెంకటరావును తీసుకొద్దామని బయలుదేరిన అరుణా పాఠక్ కుటుంబీకులు తిరుపతి ప్రయాణాన్ని విరమించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి నుంచి వెంకటరావు కారులో బయలుదేరినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బుధవారం ఆయన నెల్లిమర్ల చేరుకునే అవకాశముంది.

ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపిన అరుణా పాఠక్
పాఠక్, అరుణా పాఠక్ దంపతులు ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవారు. పాఠక్ ఉద్యోగ విరమణ అనంతరం నెల్లిమర్లలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సోదరుడు వెంకటరావు విశాఖలో ఉంటున్నారు. వెంకటరావు దీన స్థితి గురించి ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైన విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందారు. తన సోదరుడి పరిస్థితిని తెలియజేసిన ‘ఆంధ్రజ్యోతి’కి, ప్రత్యేక వాహనంతో తన సోదరుడ్ని నెల్లిమర్ల తరలించేందుకు ఏర్పాట్లు చేసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు రుణపడి ఉంటామని అరుణా పాఠక్, ఆమె భర్త పాఠక్ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News