Labor Department: కనీస వసతి, సరైన భోజనం కూడా కల్పించని వైనం
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:15 AM
రొయ్యల చెరువుల్లో ఉపాధి కల్పిస్తామంటే వారంతా పొట్టచేత పట్టుకుని వచ్చారు. ఇలా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి 40 మందిని పనిలో పెట్టుకున్న యజమానులు నెల రోజులుగా సరైన భోజనం కూడా పెట్టకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు.
వలస కూలీలతో వెట్టి
అల్లాడిపోయిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులు
ఒకరు తప్పించుకుని వెళ్లిఛత్తీస్‌గఢ్ కలెక్టర్‌కు ఫిర్యాదు
ఆయన ఫోన్‌తో కదిలిన జిల్లా అధికారులు
రెండు రాష్ట్రాలకు చెందిన 40 మందికి విముక్తి
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రొయ్యల చెరువుల్లో ఉపాధి కల్పిస్తామంటే వారంతా పొట్టచేత పట్టుకుని వచ్చారు. ఇలా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి 40 మందిని పనిలో పెట్టుకున్న యజమానులు నెల రోజులుగా సరైన భోజనం కూడా పెట్టకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. దీంతో కూలీల్లో ఒకరు తప్పించుకుని వెళ్లి బస్తర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వెట్టి చాకిరీ వ్యవహారం బయటికి వచ్చింది. వివరాలివీ.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరం లోని రెండు రొయ్యల చెరువుల యజమానులు నెల క్రితం మధ్యవర్తి ద్వారా ఒడిశా నుంచి 17 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 23 మంది.. మొత్తం 40 మంది కార్మికులను ఇక్కడికి తీసుకువచ్చారు. చెరువుల వద్ద రోజంతా వారితో గొడ్డు చాకిరీ చేయించుకునేవారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు.. సరైన భోజనం కూడా పెట్టేవారు కాదు. కనీస వసతి సైతం కల్పించలేదు. అరకొరగా బియ్యం మాత్రమే ఇవ్వడంతో దాంతో గంజి కాచుకుని అర్ధాకలితో అలమటించేవారు. ఈ నేపథ్యంలో ఒక కార్మికుడు అక్కడి నుంచి తప్పించుకొని ఛత్తీస్‌గఢ్లోని బస్తర్ వెళ్లి అక్కడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె ఆదేశాలతో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో రెవెన్యూ, కార్మిక, ఇతర శాఖల అధికారులు రంగంలోకి దిగారు. బాధిత కార్మికులకు విముక్తి కల్పించి ఒంగోలుకు తరలించారు. వారికి కలెక్టర్ అన్సారియా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రిలీఫ్ సర్టిఫికెట్లను అందించారు. వారు పనిచేసిన కాలానికి నగదు ఇప్పించడంతోపాటు, వారి స్వస్థలాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు.
కాగా, బాధితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నారని ఒంగోలు ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న తెలిపారు. సదరు పరిశ్రమలపై వెట్టిచాకిరీ నిర్మూలన, బాలకార్మిక నిర్మూలన, కనీస వేతన చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, కార్మికశాఖ,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
మధ్యవర్తుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి..
జిల్లాలోని తీరప్రాంతంలోని రొయ్యలు, చేపల చెరువుల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని మధ్యవర్తుల ద్వారా పనికి తీసుకొస్తుంటారు. అయితే, వారికి చెరువుల యజమానులు కనీస వసతి, సదుపాయాలు కల్పించ కుండాపనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. అనంతవరంలో వెలుగుచూసిన ఘటనతో ఇలాంటి పరిశ్రమలపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.