Chancellor Somaiya Vidyavihar University: వ్యవసాయ రంగం అభివృద్ధికి
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:36 AM
మట్టిలోని జీవ కణాలు, కార్బన్ మీద దృష్టి తగ్గిపోతున్న క్రమంలో వ్యవసాయ రంగంతో కలిసి యువ శాస్త్రవేత్తలందరూ పనిచేయాలని గోదావరి బయో రిఫైనరీస్ లిమిటెడ్ చైర్మన్...
యువ శాస్త్రవేత్తలు కృషిచేయాలి: సమీర్ సోమయ్య
ఘనంగా తిరుపతి ఐసర్ 6వ స్నాతకోత్సవం
ఏర్పేడు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మట్టిలోని జీవ కణాలు, కార్బన్ మీద దృష్టి తగ్గిపోతున్న క్రమంలో వ్యవసాయ రంగంతో కలిసి యువ శాస్త్రవేత్తలందరూ పనిచేయాలని గోదావరి బయో రిఫైనరీస్ లిమిటెడ్ చైర్మన్, సోమయ్య విద్యావిహార్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ సమీర్ సోమయ్య పిలుపునిచ్చారు. తిరుపతి సమీపంలోని ఐసర్(భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ)లో మంగళవారం జరిగిన ఆరవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాము రైతులతో కలిసి పనిచేస్తామన్నారు. పంచగవ్య, జీవామృతం వంటి సాంప్రదాయక విధానాలను పరిశీలించి, శాస్ర్తీయంగా పరిశోధించి వాటిని ఆధునిక పద్ధతులతో మిళితం చేయడం ప్రారంభించామన్నారు.ఈ కృషి ఫలితంగా ఉత్తర కర్ణాటకలోని ఓ రైతు సగటున 30 టన్నులకు బదులుగా 120 టన్నుల చెరకు దిగుబడి సాధించారన్నారు. అంతకుముందు ఐసర్ బోర్డు ఆఫ్ గవర్నస్ చైర్‌పర్సన్ ఝిల్లు సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మార్పు కోసం మార్గనిర్దేశకులుగా మారాలన్నారు.వ్యవసాయం, సస్టైనబుల్ కెమిస్ర్టీ, సెమీకండక్టర్, ఎంజైమ్ తయారీ రంగాల్లో పరిశోధనలు చేయాలని ప్రోత్సహించారు.ఐసర్ డైరెక్టర్ శాంతను భట్టాచార్య మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా రెండేళ్ల మాస్టర్ బై రీసెర్చ్(ఎంఎస్ -ఆర్) కోర్సును ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అంతకుముందు రిజిస్ట్రార్ ఇంద్రపీత్ సింగ్ కోహ్లీ ఆధ్యక్షతన 2025కి గాను 225 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.