ఐతవరం-అంబారుపేట ట్రాఫిక్ సమస్యకు చెక్
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:08 AM
నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట గ్రామాల మధ్య బైపాస్ రోడ్డు విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా మునేటికి వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాల మధ్య జాతీయ రహదారి మునిగిపోతోంది. ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది.
బైపాస్ నిర్మాణానికి కేంద్రం హామీపై హర్షాతిరేకాలు
హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్ 65 విస్తరణలో భాగం
ఇక మునేటికి భారీ వరద వచ్చినా ఇబ్బంది ఉండదు
(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల) : నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట గ్రామాల మధ్య బైపాస్ రోడ్డు విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా మునేటికి వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాల మధ్య జాతీయ రహదారి మునిగిపోతోంది. ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. తాజాగా ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ సమస్యలకు చెక్ పడినట్టు అయ్యింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే హైదరాబాద్-విజయవాడ ఆరు వరసల విస్తరణ గురించి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి విజయవాడలోని పున్నమిఘాట్ వరకు జాతీయ రహదారి-65ని ఆరు వరసలుగా విస్తరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా ‘ఐతవరం-అంబారుపేట’ బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు.
ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్య
తెలంగాణాలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసినపుడు మునేరుకు భారీ వరద వస్తోంది. కీసర వంతెన దాటాక ఐతవరం వద్ద మునేరు రోడ్డెక్కుతుండటంతో ఎంతో ప్రాధాన్యత కలిగిన జాతీయ రహదారిపై తరచూ వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. 2004లో నాలుగు లైన్లుగా జాతీయ రహదారిని అభివృద్ధి చేసినప్పటికీ ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. దీంతో మునేటికి భారీ వరద వచ్చిన ప్రతిసారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. 2005 వరదల సమయంలో రెండు రోజులకుపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 2023 వరదలప్పుడు 26 గంటలసేపు కంచికచర్ల-నందిగామ మధ్య జాతీయ రహదారి బంద్ అయ్యింది. 15 కార్లు, ఐదు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.
విస్తరణతో సమస్యకు పరిష్కారం
తాజాగా హైదరాబాదు-విజయవాడ మధ్య 65వ నెంబరు జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇప్పుడున్న నాలుగు వరసల రోడ్డును ఆరు వరసలుగా విస్తరించనున్నారు. ఈ జాతీయ రహదారి ఐతవరం, అంబారుపేట గ్రామాల మీదుగా వెళ్తుంది. విస్తరణలో భాగంగా ఈ రెండు గ్రామాల వద్ద బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు. రెండు రోజుల క్రితం మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ ఈ బైపాస్ రోడ్డు గురించి ప్రస్తావించారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మిస్తే మునేటికి ఎంత వరద వచ్చినా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.