Nimmala Ramanaidu: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:32 PM
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్‌లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
అమరావతి , అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Montha Cyclone) నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకి కడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకి తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, స్యూయిజ్‌లు, సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని ఆజ్ఞాపించారు. దిగువకు నీరు విడుదల చేసే ముందు, సమీప నీటి ప్రవాహ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని మార్గనిర్దేశం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని, బుడమేరు డైవర్షన్ ఛానెల్‌పై నిరంతర నిఘా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు యూటీ వరకు విజయవాడ నగర పరిధిలో.. పాత బుడమేరు సమీప ప్రాంతంలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. ఎర్ర కాలువ, యనమదురు డ్రైన్, బురద కాలువ, సుద్ద వాగు, ఏలేరు రిజర్వాయర్, రైవాడ కాలువ వంటి వాటిపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, శాఖలతో ఎప్పటికప్పుడూ సమన్వయం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
మొంథా తుపానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. అధికారులకు దిశానిర్దేశం
Read latest AP News And Telugu News