Share News

Pawan Kalyan on Cyclone: మొంథా తుపానుపై అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:09 PM

మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan on Cyclone: మొంథా తుపానుపై అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
Pawan Kalyan on Cyclone Montha

అమరావతి , అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులకి దిశానిర్దేశం చేశారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందని తెలిపారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో ఇవాళ(సోమవారం) వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు హాజరయ్యారు.


ఈ సమావేశంలో అధికారులకి పలు కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేయాలని సూచించారు పవన్ కల్యాణ్.


ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురికాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొంథా తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. తుపాను దృష్ట్యా విద్యుత్ స్తంభాలు ఒకవేళ పడిపోతే వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. 24 గంటలూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల

Read latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 06:19 PM