మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:30 AM
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్యకర్తల మధ్య ఘర్షణలు, నినాదాలు, దొంగ ఓట్ల యత్నాలు వంటి ఘటనలు వెలుగుచూశాయి. పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల ఘర్షణ
మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగాయి.
పరిస్థితి ఉద్రిక్తం..
కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్న వెంటనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
భారీగా పోలీసుల మోహరింపు
పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు 14వ వార్డులో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల వరకు 14 శాతం పోలింగ్ నమోదైంది. నగరంలోని కోటగల్లీ 25వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పెద్ద ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.
బోధన్‌లో నినాదాలు..
బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
దొంగ ఓట్ల యత్నం..
నిజామాబాద్ జిల్లాలోని రాకాసిపేట్ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వారిని అడ్డుకుని కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలోనూ స్వల్ప ఉద్రిక్తత..
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
బాహాబాహీ..
బీజేపీ, బీఆర్‌ఎస్ ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో దొంగ ఓటు యత్నం..
సంగారెడ్డి జిల్లాలోని 28వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సదరు వ్యక్తి.. 28వ వార్డులో మరోసారి ఓటు వేసేందుకు వచ్చినట్లు గుర్తించారు. అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఆ వ్యక్తి చేతి వేలికి సిరా గుర్తువేసి పోలింగ్ కేంద్రం నుంచి పంపించారు. చట్టపరంగా ఆ వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..
రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు
Read Latest Telangana News And AP News And Telugu News