పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:04 PM
కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతుని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు..
కామారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో పాడి గేదెల పేరుతో భారీ సైబర్ మోసం (Cyber Fraud) జరిగింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన చాకలి రమేశ్ అనే రైతు నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.8.84 లక్షలు కాజేశారు..
యూట్యూబ్ రీల్స్ ద్వారా మోసం..
రైతు రమేశ్ యూట్యూబ్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో, తక్కువ ధరకు పాడి గేదెలను హోమ్ డెలివరీ చేస్తామంటూ ఓ పోస్ట్ కనిపించింది. ఆ పోస్ట్‌లో ఉన్న సెల్ నెంబర్‌కు కాల్ చేయగా, అవతలి వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి డీల్ ఖరారు చేసినట్లు సమాచారం.
లింక్ పంపిన కేటుగాళ్లు..
పాడి గేదెలను హోమ్ డెలివరీ చేయడం కోసం ఆన్‌లైన్‌లో డబ్బులు పంపాలని సదరు రైతుకు ఓ లింక్‌ను పంపించారు. వారి మాటలు నమ్మిన రైతు రమేశ్.. విడతలవారీగా మొత్తం రూ.8.84 లక్షలు పంపించాడు. డబ్బులు పంపిన తర్వాత కూడా పాడి గేదెలు హోమ్ డెలివరీ కాకపోవడంతో రైతు రమేశ్ అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
ఈ ఘటనపై దోమకొండ పోలీస్ స్టేషన్‌లో రైతు రమేశ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ మోసం కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రజలకు పోలీసుల సూచనలు..
పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ పోస్టులను నమ్మి డబ్బులు పంపొద్దని సూచించారు. తక్కువ ధర, హోమ్ డెలివరీ అంటూ వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్
వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..
Read Latest Telangana News And AP News And Telugu News