వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:48 AM
వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల (ఫిబ్రవరి) 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లేఖలో హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు జిహాదీ బృందం వందేభారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పథకం వేశారంటూ అగంతకుడు లేఖలో పేర్కొన్నాడు. వందేభారత్ వెళ్లే లైన్లలో బాంబులు పెట్టి 250మందిని చంపేదుకు పథకం వేశారంటూ లేఖలో ప్రస్తావించాడు.
రైల్వే మార్గాల్లో ప్రమాదకర చర్యలకు సిద్ధమయ్యారనే ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. అలాగే, నలుగురు వ్యక్తుల పేర్లను కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖ అందిన వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా దృష్ట్యా వందేభారత్ రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..
అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Read Latest Telangana News And AP News And Telugu News