Share News

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:33 AM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..
Operation Tiger

రాజమండ్రి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం కృష్ణయ్య కాలనీ సమీపంలోని పొలాల్లో పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఆరు రోజులుగా పులి దాడుల్లో పశువులు మృతిచెందడంతో, ప్రజల భద్రత దృష్ట్యా అటవీ శాఖ ‘ఆపరేషన్ టైగర్’ను ముమ్మరంగా కొనసాగిస్తోంది.


కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి నేతృత్వంలో గాలింపు..

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. పులి జాడను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అటవీ శాఖకు చెందిన అనుభవజ్ఞులైన సిబ్బంది పొలాలు, అటవీ ప్రాంతాలు, పశువుల దాడులు జరిగిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.

పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం..

పులి రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు పూణే నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందం రాజమండ్రికి చేరుకుంది. ఈ బృందం నిన్న(గురువారం) రాత్రి 8:30 గంటల నుంచి అధికారికంగా టైగర్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. అడవి జంతువుల పట్టివేతలో అనుభవం కలిగిన ఈ బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది.


పులి జాడ కోసం 25 ట్రాప్ కెమెరాలు..

పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు.. కీలక ప్రాంతాల్లో 25 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి వెళ్లే అవకాశమున్న దారులు, పశువుల దాడులు జరిగిన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో ఈ కెమెరాలను అమర్చారు. వీటివల్ల పులి ఎక్కడ తిరుగుతుందో స్పష్టమైన సమాచారం లభించనుంది.

4G కెమెరాలతో ప్రత్యక్ష నిఘా..

పులి కదలికలను తక్షణమే గుర్తించేందుకు పది 4G కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ కెమెరాలను నేరుగా అధికారుల ఫోన్లకు అనుసంధానం చేశారు. దీంతో పులి కదలికలు నమోదైన వెంటనే సిబ్బందికి అలర్ట్ మెసెజ్ వస్తోంది. ఇది రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయడంలో కీలకంగా మారింది.


థర్మల్ డ్రోన్‌తో పులి శరీర ఉష్ణోగ్రత గుర్తింపు..

రాత్రి వేళల్లోనూ పులి జాడను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్‌ను అటవీ శాఖ వినియోగిస్తోంది. ఈ డ్రోన్ ద్వారా పులి శరీర ఉష్ణోగ్రతను గుర్తించి, దాని కదలికలను ట్రాక్ చేయగలుగుతున్నారు. అడవులు, పొలాల్లో దాగి ఉన్న పులిని గుర్తించేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతోంది.

మత్తుమందు ఇచ్చి బంధించేందుకు మూడు బోన్లు..

పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మత్తుమందు ఇచ్చిన తర్వాత పులిని బంధించేందుకు మూడు ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోన్ల వద్ద పీటీజెడ్ (PTZ) కెమెరాలు అమర్చారు. పులి బోన్ల సమీపానికి వచ్చిన వెంటనే అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.


ఆరు రోజుల్లో ఎనిమిది పశువులపై దాడి..

గత ఆరు రోజుల వ్యవధిలో పులి తొర్రేడు రఘునాథపురం పుణ్యక్షేత్రం, జి.ఎర్రంపాలెం గ్రామాల పరిధిలో మొత్తం ఎనిమిది పశువులపై దాడి చేసి చంపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనలతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజల భద్రతే లక్ష్యం..

పులి దాడుల నేపథ్యంలో గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, పులి కనిపిస్తే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.


నష్టపరిహారం ప్రకటించిన అటవీ శాఖ..

పులి దాడిలో మృతిచెందిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందజేస్తామని అటవీ శాఖ అధికారులు భరోసా ఇచ్చారు. బాధిత రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.

‘ఆపరేషన్ టైగర్’పై ఉత్కంఠ

రాజమండ్రి పరిసరాల్లో కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌పై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. అత్యాధునిక సాంకేతికత, నిపుణుల బృందం, అటవీ శాఖ సమన్వయంతో పులిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సహకారంతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 11:37 AM