Share News

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:09 PM

హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ఎద్దేవా చేశారు..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు
Harish Rao

సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ఎద్దేవా చేశారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి, వాళ్ల భర్తలకు మాత్రం డబల్ టికెట్ రేట్లు పెట్టి బాదుతున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో గల బచ్చుగూడెంలో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


పాలనను గాలికొదిలేశారు..

కేసీఆర్ కిట్ బంద్, బతుకమ్మ చీరలు బంద్, గొర్రెల పంపిణీ బంద్, చేప పిల్లలు బంద్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్.. అన్నీ బంద్ పెట్టి పాలనను గాలికొదిలేశారని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ రూ. 2000 పెన్షన్ ఇస్తే.. రేవంత్‌రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. అక్కాచెల్లెళ్లకు నెలకు రూ. 2500 ఇస్తా అన్నారని.. ఇప్పుడు ఇచ్చారా..?, తులం బంగారం ఇస్తానన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేవి ఉత్త మాటలు.. చేసేవి మోసాలేనని సెటైర్లు గుప్పించారు.


కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పదిలం..

పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత పదిలంగా ఉంటుందో.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటే అంతే పదిలంగా ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. మన తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సురక్షితమని చెప్పుకొచ్చారు. ఇంకో రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జనాలే చెబుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారని.. రెండేళ్ల తర్వాత వాళ్లు ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని అన్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మిగిలిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం బాధ్యత తాను తీసుకుంటానని మాటిచ్చారు. మనల్ని మోసం చేసిన రేవంత్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పి.. కేసీఆర్‌కి విజయాన్ని కానుకగా ఇవ్వాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 08 , 2026 | 01:56 PM