19న మరో పథకం ప్రారంభం.. మంత్రి వివేక్ కీలక ప్రకటన
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:45 PM
సీఎం రేవంత్‌రెడ్డి రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని 19వ తేదీన సిద్దిపేట వేదికగా ప్రారంభిస్తారని తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు. ఈ పథకాన్ని అర్హులకు ఇస్తామని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని సిద్దిపేట వేదికగా 19వ తేదీన ప్రారంభిస్తారని తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు. ఈ పథకాన్ని అర్హులకు ఇస్తామని స్పష్టం చేశారు. రూ.20 లక్షల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌నూ అమలు చేస్తామని తెలిపారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో పట్టణంలో సభ స్థలి కోసం పలు ప్రాంతాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హైమవతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

మా ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు..
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి వివేక్ వెంకట్ స్వామి వ్యాఖ్యానించారు. ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి సభను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సభ కోసం మూడు, నాలుగు స్థలాలు చూశామని.. ఒకటి ఫైనల్ చేశామని వెల్లడించారు. తెలంగాణలో మాదిరిగా పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్లను ఎక్కడా కట్టలేదని మంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు.
అన్ని పథకాలను అమలు చేస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
చిలక పచ్చరంగు ఇందిరమ్మ చీరలను సీఎం రేవంత్‌రెడ్డి 19వ తేదీన ఆవిష్కరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మూడేళ్లలో ఎన్నికల ముందు చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. సిద్దిపేట సభ ద్వారా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో అమలు చేసే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రకటిస్తారని అన్నారు. సీఎం సభకు సిద్దిపేట చుట్టూ పక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం
క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు
ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News