Share News

కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:59 PM

మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivasa Reddy

సిద్దిపేట జిల్లా, జులై 6 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Telangana Minister Ponguleti Srinivasa Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు. కానీ నిందలేమో తమ ప్రభుత్వంపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ప్రతిసారి కర్రు కాల్చి వాత పెడుతున్నారని హెచ్చరించారు. ఈరోజు (సోమవారం) సిద్దిపేట జిల్లా ములుగులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లపట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.


కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి..?

పేదోడి కష్టం తెలియని బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రం కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అధికారం కావాలనే దాహంతో తమ ప్రభుత్వంపై నిందలు మోపడం బీఆర్ఎస్ నేతలు ఆపాలని హితవు పలికారు. చిత్తశుద్ధితో సలహాలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీకి రావాలని కోరారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు కాదని.. ఎనిమిదో వింత కాళేశ్వరమని ఆనాడు చెప్పిన పెద్దమనిషి అసెంబ్లీకి రావాలని సూచించారు. కాళేశ్వరం ఎలా కట్టారో చెప్పాలని, కేసీఆర్ తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని పేర్కొన్నారు.


చిత్తశుద్ధితో ఇళ్లను మంజూరు చేస్తున్నాం..

రాష్ట్రంలో 32 వేల పూరి గుడిసెలు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మొదటి విడతలో ఇవ్వలేక పోయిన వాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో ఇస్తామని.. వారికే మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. ఏ పార్టీల్లోని లబ్ధిదారులైనా.. పైరవీ లేకుండా చిత్తశుద్ధితో ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట గజ్వేల్, సిరిసిల్ల, నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అత్యధికంగా కట్టుకున్నారని చెప్పారు. వేరే నియోజకవర్గాల్లో అరకొరగా 50, 60 ఇళ్లు కట్టి అసంపూర్తిగానే వదిలేశారని తెలిపారు. రెండోవిడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామని వ్యాఖ్యానించారు. గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించామని చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 06:27 PM