రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టేలా రేవంత్ సర్కార్ కుట్ర: హరీశ్‌రావు
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:08 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిద్దిపేట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ డిస్కమ్ ఏర్పాటు జీవోను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదాతకు ఉరి వేసే కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ సహించదని హెచ్చరించారు. ఈ మేరకు హరీశ్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ డిస్కం జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతన్నలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఈ డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ -17 జారీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర?..
రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ చేయడమంటే కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనమని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, అన్నదాత మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర? అని ఆగ్రహించారు. వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ డిస్కమ్ ఏర్పాటుతో రైతన్నలకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్వాకంతో రైతన్న మరింత ఇబ్బందుల్లో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదని.. రేపు ఈ డిస్కంతో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఉచిత విద్యుత్‌పై చేతులెత్తేసేందుకే సర్కార్ కొత్త ఎత్తుగడ..
రైతు మెడకు ఈ డిస్కం ఉచ్చు అని.. ఉచిత విద్యుత్‌పై చేతులెత్తేసేందుకే కాంగ్రెస్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోతున్నాయని రైతన్న కన్నీరు పెడుతుంటే.. డిస్కంల పేరుతో రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతోందని ఆగ్రహించారు. ఈ జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, HMWSSB, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు ఈ డిస్కంకు బదిలీ చేశారని చెప్పుకొచ్చారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం 25శాతం థర్మల్ పవర్ అలకేషన్‌తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరమయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? అని నిలదీశారు. 6,15,651 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల వ్యవసాయ ఎల్‌టీ లైన్లు.. వీటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోతే అన్నదాతల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సర్కార్.. రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా?..
రాష్ట్ర విద్యుత్ కేటాయింపుల్లో ఇప్పటికీ 53.28 శాతం థర్మల్ విద్యుత్తే ఉందని హరీశ్‌రావు వెల్లడించారు. సౌర విద్యుత్తు వాటా 35.31 శాతం మాత్రమేనని.. ఇందులో థర్మల్ 25 శాతం, సోలార్ 58 శాతం, హైడల్ మొత్తంగా 100శాతం రైతు డిస్కమ్‌కు కేటాయించారని ప్రస్తావించారు. పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి పూట ఉండదని చెప్పారు. అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా? అని ప్రశ్నించారు. 2325 MW హైడల్ (జల విద్యుత్) పవర్ మొత్తం ఈ డిస్కమ్‌కే కేటాయించారని... కానీ ఈ హైడల్ పవర్ సాంకేతికంగా ఏడాదిలో కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంటే మిగతా 8 నెలలు రైతు డిస్కమ్‌కి ఈ విద్యుత్ అందుబాటులో ఉండదని..అప్పుడు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. కొత్త డిస్కమ్‌కు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ.. దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోంది?, ఈ అప్పుల భారం చివరకు రైతన్నలపై పడేయాలని చూస్తున్నారా? అని మండిపడ్డారు. ఈ డిస్కమ్ పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, రేపు నష్టాల సాకుతో అన్నదాతలపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా? అని నిలదీశారు. రైతన్నలకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం
ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం
మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News