Share News

వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:01 PM

కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ప్రతి ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు.

వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు
Harish Rao

సిద్దిపేట జిల్లా, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు ప్రతి ఏడాది రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మైనారిటీలకు రూ.1,800 కోట్ల వరకు ఖర్చు చేశామని తెలిపారు. తెలంగాణ తురక కాశ సంక్షేమానికి చేయూత కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా 90 మంది కాశ కార్మికులకు స్టోన్ కటింగ్ మిషన్లను హరీశ్‌రావు ఈరోజు (ఆదివారం) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు, ఖర్చు తగ్గాయని చెప్పుకొచ్చారు.


మైనారిటీ గురుకులాల నిర్వహణ గాడితప్పింది..

మైనారిటీ గురుకులాల నిర్వహణ గాడితప్పిందని.. విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని హరీశ్‌రావు అన్నారు. విదేశీ విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు అందుతున్న స్కాలర్‌షిప్‌లు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మైనారిటీ కార్పొరేషన్‌ ఉద్యోగులకు నెలలుగా జీతాలు అందడం లేదని చెప్పారు. ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు ఏడాదిగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. మల్లన్నసాగర్‌ను కేసీఆర్‌ అద్భుతంగా నిర్మించారని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో గజ్వేల్‌ రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌తో గజ్వేల్‌కు సాగునీరు అందించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేస్తే మల్లన్నసాగర్‌కు నీరు వస్తుందని వివరించారు. కన్నెపల్లి నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో మల్లన్నసాగర్‌కు నీరందడం లేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మల్లన్నసాగర్‌ పనుల్లో ఇంకా 5 శాతం వరకు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కోర్టు కేసులను పరిష్కరించి మిగిలిన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్‌ నీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు భారీ పైపులైన్లు వేశారని చెప్పారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.


కల్యాణలక్ష్మి బకాయిలను చెల్లించాలి..

వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు కేసీఆర్‌ హయాంలో ఇళ్లు, మౌలిక వసతులు కల్పించామని ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని, వెయ్యి రోజులు దాటినా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ఎన్నికల హామీ లేకపోయినా కేసీఆర్‌ ప్రారంభించారని ప్రస్తావించారు. కేసీఆర్‌ హయాంలో 2.50 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రతి ఏడాది రూ.2,600 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి చెక్కుల కోసం రాష్ట్రంలో 2 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. పెళ్లిళ్లు చేసుకున్న పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పట్టుబట్టారు.


కాంగ్రెస్‌ పాలనలో గజ్వేల్‌లో అభివృద్ధి మందగించింది..

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందక పంటలు ఎండిపోతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్‌లో రోడ్లు, డ్రైనేజీ, ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలల్లో అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. మూడేళ్ల కాంగ్రెస్‌ పాలనలో గజ్వేల్‌లో అభివృద్ధి మందగించిందని అన్నారు. గజ్వేల్‌లో కొత్త అభివృద్ధి పనుల కంటే ‘ఇళ్లు, దుకాణాలు అద్దెకు’ బోర్డులే కనిపిస్తున్నాయని తెలిపారు. గజ్వేల్‌ ప్రజలు ఎవరు ఏం చేశారో గమనిస్తున్నారన్నారు. పనులు చేసిన వారినే ప్రజలు గుర్తిస్తారని.. మాటలు చెబితే ప్రయోజనం లేదని చెప్పారు. కళ్ల ముందు కనిపించే అభివృద్ధినే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. గజ్వేల్‌ అభివృద్ధికి కేసీఆర్‌ చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 05:34 PM