Share News

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు

ABN , Publish Date - Sep 15 , 2026 | 12:16 PM

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

అసైన్డ్ భూములపై రేవంత్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి:  ఎంపీ రఘునందన్ రావు
BJP MP Raghunandan Rao

ఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో 22ఏపై చర్చ జరుగుతుందని ప్రజలు భావించారని.. కానీ అలా ఎందుకు జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు. గుడులు, బడులు, దేవస్థానాల భూములు, ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేయొద్దని 22 ఏ చట్టం తీసుకువచ్చారని ప్రస్తావించారు. 22ఏపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు. 22ఏ గురించి ఎవరు మాట్లాడినా అందరినీ ఒకే గాడిన కట్టడం సరికాదని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలోని సింఫనీ హోంలో రిజిస్ట్రేషన్ల సమస్య ఉండటంతో మాట్లాడానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయారనీ ఎలా మాట్లాడారని నిలదీశారు.


22ఏలో ఉన్నా 47440 ఎకరాలు ఎక్కడ, ఏ ఊరిలో తొలగించారో మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 22 ఏ లో చేర్చిన భూమి తొలగించామంటున్న కాంగ్రెస్ 22 ఏ లో చేర్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 22 ఏ లో కోటి ఎకరాలకు పైగా భూమి ఉందని.. ఇంత భూమి ఎలా చేర్చారు.. ఎలా తొలగిస్తారో పొంగులేటి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పేదలకు అన్యాయం చేసిన అధికారులపై, కలెక్టర్లపై చర్యలు తీసుకున్నారా లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22 ఏ లో ఉన్న కోటి రెండులక్షల ఎకరాల భూమి ఎప్పటి వరకు తొలగిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటి వేసి 22 ఏ భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు.


భూ భారతి వచ్చిన తర్వాత కూడా తప్పు జరిగిందని పొంగులేటి ఒప్పుకున్నారని అన్నారు. పేద ప్రజలకు అన్యాయం చేసి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ధరణి, భూ భారతి తెచ్చిన రెండు పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కేసులపై రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు జరపాలని.. ప్రతిదానికి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కమిటీలతో కాలయాపన ఉండదని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు

శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 12:36 PM