ఖమ్మం జిల్లాలో వేర్వేరు అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం
ABN , Publish Date - Mar 21 , 2026 | 07:29 PM
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
ఖమ్మం జిల్లా, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు ఈరోజు(శనివారం) జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా (Ola) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది.
అయితే, ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టం సంభవించకపోయినా, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోటరీనగర్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో..
ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ప్రాంతంలో ఉన్న ఓలా (Ola) ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూమ్‌లో ఉన్న పలు ఎలక్ట్రిక్ బైకులు మంటలకు ఆహుతయ్యాయి. బైకుల బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఛార్జింగ్ పెట్టిన సమయంలో లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో..
ఖమ్మం జిల్లాలోని మధిర మండలం, ఆత్కూర్ సమీప ప్రాంతంలో గల శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మంటల్లో కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కోల్డ్ స్టోరేజీలో ఉండే ఇన్సులేషన్ మెటీరియల్ కారణంగా మంటలను ఆర్పడం సిబ్బందికి సవాలుగా మారింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ రెండు అగ్నిప్రమాదాలు భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉపకరణాల వినియోగంలో అజాగ్రత్త వహించవద్దని అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలకు రేవంత్, భట్టి గోరి కట్టారు: హరీశ్‌రావు
పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. వాటి విలువ ఎంతంటే
Read Latest Telangana News And AP News And International News And Telugu News