Share News

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 14 , 2026 | 09:06 PM

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
Thummala NageswaraRao

భద్రాద్రి కొత్తగూడెం, మే 14 (ఆంధ్రజ్యోతి): స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala NageswaraRao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు (గురువారం) మంత్రి తుమ్మలకు పామాయిల్ రైతులు ఆత్మీయ సత్కరం చేశారు. మంత్రిగా నలభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా తుమ్మలను సత్కరించారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మంత్రి తుమ్మల ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పది ఉమ్మడి జిల్లాల పామాయిల్ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.


MSPలపై మంత్రి అసంతృప్తి

పెరిగిన సాగు వ్యయాలకు MSPలు సరిపోవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. వరి MSP కేవలం 72శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెంచిందని దుయ్యబట్టారు. మొక్కజొన్న MSPపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 10శాతం పెంపుతో రైతులకు న్యాయం జరగదని తెలిపారు. MSPలు కనీసం 30 నుంచి 40 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. MSP ప్రకటించడం కాదని.. కొనుగోలు చేయడమే ముఖ్యమని తెలిపారు. ప్రతి పంటలో 75శాతం దిగుబడిని కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, జొన్నలను PSSలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దళారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం మొక్కజొన్న, జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. కొనుగోళ్లతో రాష్ట్రంపై రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. పత్తి, వేరుశనగ, సోయాబీన్ MSPలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆదాయం పెంచే సంకల్పం కేంద్రానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పామాయిల్ సాగు విస్తరణకు ప్రాధాన్యం..

పామాయిల్ సాగుకు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు చేతుల మీదుగా శ్రీకారం చుట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నలబై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పామాయిల్ సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చానని ప్రస్తావించారు. అకాల వర్షాలతో ధాన్యం, మొక్కజొన్న రైతులు కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ సమస్యలు చూసిన వారు పామాయిల్ సాగు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే తెలంగాణ రైతాంగం అవస్థలు పడుతోందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రం సహకరించకున్నా మద్దతు ధరకు పంటలు కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతాంగం కోసం ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా ఖర్చు పెట్టామని తెలిపారు. ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చంద్రబాబు జీఓ నంబర్ -3 తీసుకువచ్చారని ప్రస్తావించారు. నలబై ఏళ్ల క్రితం రైతాంగం కష్టాలు ఈ తరం వారికి లేవని చెప్పుకొచ్చారు.


హార్టికల్చర్ హబ్‌గా అశ్వారావుపేట..

మారిన కాలానుగుణంగా అన్నదాతలు ప్రకృతి వైపరీత్యాలు, కోతుల బెడద, చీడ పీడలు లేకుండా పామాయిల్ సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పోటీ పడ్డా ఎన్టీఆర్ వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటకే ఇచ్చారని ప్రస్తావించారు. హార్టికల్చర్ హబ్‌గా అశ్వారావుపేట ఉందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ కళాశాలకు తోడు ఉద్యాన కళాశాల అశ్వారావుపేట కు మణిహారమని ఉద్ఘాటించారు. చంద్రబాబు హెలికాఫ్టర్ నుంచి చూసి అశ్వారావుపేట పచ్చదనంపై ఆశ్చర్య పోయారని తెలిపారు. యుద్ధాలు జియో పాలిటిక్స్ వల్ల యూరియా సరఫరాలో కేంద్రం అనుకున్న స్థాయిలో సరఫరా చేయలేదని అన్నారు. ప్రతి ఏటా మన దేశంలో లక్ష కోట్ల రూపాయలు పామాయిల్ దిగుమతి అవుతోందని వివరించారు.


ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాలి..

పామాయిల్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే మన రైతాంగానికి మద్దతు ధర పెరుగుతుందని మంత్రి తుమ్మల అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణకు పామాయిల్ సాగు వరంగా మారుతుందని చెప్పుకొచ్చారు. లక్షలాది రైతుల తలరాత మారేలా పామాయిల్ సాగు విస్తరణ చేసే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చారని తెలిపారు. ఎన్ని పదవులు చేశామని కాదని.. ముందు తరాలకు మేలు చేసేలా తన రాజకీయ ప్రస్థానం ఉంటుందని ఉద్ఘాటించారు. మంత్రిగా నలభై ఏళ్ల ప్రస్థానంలో భద్రాద్రి శ్రీ రాముడు దయవల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం దక్కిందని చెప్పుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో తనకు సహకరించిన ముఖ్యమంత్రులు, అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 09:39 PM