పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:51 PM
పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా అని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, జులై 20 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా అని పేర్కొన్నారు. ఈ రోజు(సోమవారం) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని.. వివిధ కారణాలతో సీఎం రాలేకపోయారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి తన శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.
ఖమ్మం జిల్లా రైతులు అన్నిరకాల పంటలు సాగు చేస్తారు..
అంజనాపురంలో ఆయిల్ పామ్ కాంప్లెక్స్ నిర్మించిన గోద్రెజ్ సంస్థకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి విశేషంగా కృషిచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అభినందనలు చెప్పారు. ఖమ్మం జిల్లా రైతన్నలు అన్ని రకాల పంటలు సాగు చేస్తారని వెల్లడించారు. తాను ఎన్నో రకాల పంటలు సాగు చేశానని ఏ పంటకు రాని దిగుబడి ఆయిల్ పామ్‌కు వచ్చిందని మంత్రి తుమ్మల స్వయంగా తనతో చెప్పారని అన్నారు. చివరకు ప్రకృతి విపత్తులను కూడా ఈ పంట తట్టుకొని నిలబడుతుందని చెప్పుకొచ్చారు. పామాయిల్ సాగు చేసిన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. దేశంలో 25 లక్షల మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం ఉందని తెలిపారు. దేశంలో కేవలం 12 లక్షల మిలియన్ టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని చెప్పుకొచ్చారు.
పామాయిల్ ధర పెరిగింది..
1992లో ప్రారంభించిన పామాయిల్ సాగు ఇప్పటికి దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపే స్థాయికి వచ్చిందని భట్టి విక్రమార్క వివరించారు. గతంలో పామాయిల్ టన్ను గెల ధర రూ.12000లు ఉంటే.. నేడు టన్ను ధర రూ.23 వేలకు పెరిగిందని వెల్లడించారు. అంజనాపురంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం.. ఖమ్మం జిల్లా అన్నదాతలకు ఓ వరమని ఉద్ఘాటించారు. వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదిక కాబోతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో అనేక రకాల పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News