Share News

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:45 PM

నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి  క్లాస్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జులై 19 (ఆంధ్రజ్యోతి): నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశించారు. రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశించారు. ఈరోజు (ఆదివారం) కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని ఎందుకు పనిచేయట్లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని హెచ్చరించారు. వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలని హుకుం జారీ చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని ఆదేశించారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని సూచించారు.


ఎంపీలు సమీక్షలు జరపాలి..

ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని నిర్దేశించారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు జరిగాయని తెలిపారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా నేతలు స్పందించాలని ఆదేశించారు. రేపటి నుంచి పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీపరంగా ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు.


అలా చేస్తే కఠిన చర్యలు..

ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, చైర్మన్లు బీఎల్‌ఓల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. బీఎల్‌ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. బీఎల్‌ఏ, బీఎల్‌ఓల రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.


ఎస్‌ఐఆర్‌ను ఇన్‌చార్జ్ మంత్రులు పర్యవేక్షించాల్సిందే..

ఎస్‌ఐఆర్‌ను ఇన్‌చార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాల్సిందేనని, అన్నింటికీ వారిదే బాధ్యత అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటామని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలని మార్గనిర్దేశం చేశారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పించాలని సూచించారు.


నాలుగు నియోజకవర్గాల్లో అసలే పనిచేయట్లేదు..

సర్‌పై సీఎం రేవంత్‌రెడ్డికి నేతలు రిపోర్ట్ అందజేశారు. నాలుగు నియోజకవర్గాల్లో అసలే పనిచేయట్లేదని రిపోర్ట్ వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బ‌హుదూర్‌పూర్ నియోజకవర్గాల్లో అసలు పనిచేయట్లేదని గుర్తించామని అన్నారు. పని చేయని ఆయా ప్రాంతాల ఇన్‌చార్జ్‌లపై సీఎం సీరియస్ అయ్యారు. 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగా పనిచేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. 42 నియోజకవర్గాల్లో మధ్యస్థంగా పనిచేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చిందని వివరించారు. 21 నియోజకవర్గాల్లో సరిగా పనిచేయట్లేదని గుర్తించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ప్రాణం పోశారు: సీఎం రేవంత్‌రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు అరెస్ట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 02:05 PM