Share News

హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:55 AM

హైడ్రాపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Minister Uttam Kumar Reddy

ఢిల్లీ, జులై 29 (ఆంధ్రజ్యోతి): హైడ్రాపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైడ్రాపై ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తాను మాట్లాడటం సబబు కాదని చెప్పుకొచ్చారు. మున్సిపల్ శాఖ సీఎం పరిధిలోనే ఉందని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.


ఈనెల 31న ఎన్డీఎస్‌ఏ సమావేశం

కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సమావేశం ఈనెల 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఎన్డీఎస్‌ఏ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.


మూడు బ్యారేజ్‌లను టెస్టింగ్ చేస్తున్నాం..

కాళేశ్వరంపై అంతర్జాతీయ నిపుణులతో, ఎన్డీఎస్‌ఏ అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మూడు బ్యారేజ్‌లను టెస్టింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఐఐటీ బాంబే, ఆఫ్రో ఇండియాతో రిహబిలిటేషన్ డిజైన్స్ వర్క్ పూర్తి చేస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపడతామని తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.


నాసిరకం డిజైన్‌తోనే కాళేశ్వరం కూలింది..

కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా కడితే ఈ సమస్య వచ్చేది కాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం కూలిపోవడానికి ప్రధాన కారణం నాసిరకం డిజైన్, నాసిరకం నిర్మాణమేనని వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ కంటే తెలివైన మేధావులు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తమకు ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తిపెట్టి ఫ్రీ ఫ్లోగా ఉండాలనే విషయాన్ని ఎన్డీఎస్ఏ అధికారులు స్పష్టం చేశారని అన్నారు. కాపర్ డ్యాం కట్టాలా, వద్దా అని ఎన్డీఎస్ఏ అధికారుల సలహా ప్రకారమే నడుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 01:40 PM