Share News

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:17 AM

‘మా ఇంట్లో రెండు పార్టీలు. నేనొక పార్టీ. మా అబ్బాయి లోకేశ్‌, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్‌ వేరే పార్టీ’ అని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి షాక్‌ ఇచ్చారు.

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

  • నేను కుప్పం పార్టీ..లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌ మంగళగిరి పార్టీ

  • అవసరమైతే సీఎంతో కొట్లాడి కుప్పం కోసం ఏం కావాలో తీసుకొస్తా

  • అగరం ముఖాముఖిలో భువనేశ్వరి

కుప్పం (ఆంధ్రజ్యోతి): ‘మా ఇంట్లో రెండు పార్టీలు. నేనొక పార్టీ. మా అబ్బాయి లోకేశ్‌, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్‌ వేరే పార్టీ’ అని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి షాక్‌ ఇచ్చారు. ‘నేను కుప్పం పార్టీ. లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌.. ముగ్గురూ మంగళగిరి పార్టీ’ అని చమత్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వరుసగా రెండో రోజైన మంగళవారం ఆమె పర్యటించారు. గుడుపల్లె మండలం అగరం గ్రామంలో మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ‘ఆయన (చంద్రబాబు) మీవల్లే సీఎం అయ్యారు. ఇన్నేళ్లుగా ఆయన్ను గెలిపిస్తూ వస్తున్న మీ అభిమానం వెలకట్టలేనిది. నా కుప్పానికి ఏం తీసుకొచ్చారని ఆయన్ను అడుగుతుంటాను.

మీకోసం ఏదైనా సరే.. ఆయనతో పోట్లాడి తీసుకొస్తాను. ఆయనకు ఆఫీసర్లు ఉండొచ్చు.. ఎవరెవరో సలహాలు ఇస్తుండవచ్చు. కానీ మీరు చూపిస్తున్న అభిమానం వాటన్నింటినీ మరిపిస్తోంది’ అని భువనేశ్వరి తెలిపారు. దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలని చంద్రబాబు శ్రమిస్తున్నారని తెలిపారు. ‘‘రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటినీ ఆయన చూసుకోవాలి. నేను ఆలస్యంగా కుప్పం వచ్చాను. అయినా ఫరవాలేదు. మీకోసం నేనున్నాను’’ అని భరోసా ఇచ్చారు. అంతకుముందు ఆమె కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో స్విమ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ యూనిట్‌ను, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పీఈఎస్‌ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి క్రీడలను వీక్షించి, క్విజ్‌ పోటీ నిర్వహించారు. టీటీడీ శ్రీవారి ట్రస్టు నిధులు రూ.34 కోట్లతో నియోజకవర్గంలోని 139 ఆలయాల్లో జరుగుతున్న పనుల పురోగతిపై ట్రస్టు బోర్డు సభ్యులు, ధర్మకర్తలతో యామగానిపల్లె ధర్మరాజులస్వామి ఆలయంలో సమావేశమై చర్చించారు.

Updated Date - Jul 29 , 2026 | 09:17 AM