కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:42 PM
కేసీఆర్ హయాంలో తెలంగాణలో పేదలకు అందాల్సిన ఆస్తులపై కన్నేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆ భూములను కొల్లగొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో తెలంగాణలో పేదలకు అందాల్సిన ఆస్తులపై కన్నేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. ఆ భూములను కొల్లగొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని విమర్శించారు. 22ఏ సంబంధిత భూముల సమస్యలపై అసెంబ్లీలో లఘు చర్చను మంత్రి పొంగులేటి ఈరోజు (శనివారం) ప్రారంభించారు. ఆ మాస్టర్ స్కెచ్‌లో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో ధరణిని తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ధరణిని తీసుకువచ్చారని అన్నారు. కేసీఆర్ హయాంలో నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య అర్థరాత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ధరణి వచ్చాక పేదలు అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
తెలంగాణ భూములను విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టారు..
ధరణి నిర్వహణ కాంట్రాక్ట్‌ను కూడా తమకు అనుకూలమైన సంస్థకే ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ భూములను విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ఆరోపించారు. తాకట్టు పెట్టిన భూములను మరో సంస్థకు బదిలీ చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ భూములను సొంత ఆస్తుల్లా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను ఒక్కొక్కటిగా తాము అసెంబ్లీ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న నాయకులు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా ధరణిపై మాట్లాడారని చెప్పారు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేయాలని.. కానీ విషం చిమ్మే సంస్కృతి సరికాదని పేర్కొన్నారు.
పేదల భూములను దోచుకునేందుకే ధరణిని తీసుకొచ్చారు..
‘పేదల భూములను దోచుకునేందుకే ధరణిని తీసుకొచ్చారు. తప్పు చేసినవారు.. తల వంచుకుంటారని.. పాపం చేసినవారు పారిపోతారు. ఈరోజు శాసనసభ సాక్షిగా అదే అక్షరాలా నిజమైంది. ఈ భూములపై చర్చకు ముఖం చాటేయడం బీఆర్ఎస్ నేతలకు కొత్తేమీ కాదు. సభలో గందరగోళం సృష్టించి ఉద్దేశపూర్వకంగానే పారిపోయారు. కేసీఆర్ హయాంలో రెవెన్యూ శాఖలో భారీ స్కాం చేశారు. అడ్డగోలుగా నొక్కేసిన భూముల లెక్కలు చిన్నవి కాదు. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోవచ్చు.. కానీ నాలుగు కోట్ల మంది ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ కోసం పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేశారు. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. పేదలకు పూర్తి హక్కులు వస్తాయని ప్రజలు కలలు కన్నారని.. కానీ తెలంగాణను వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. వారి ఆస్తులు.. బంధువుల ఆస్తులు పెంచుకునేందుకే తెలంగాణను వాడుకున్నారు. భూముల విషయంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. రెవెన్యూ శాఖ మొత్తం అప్పటి ముఖ్యమంత్రి కన్నుసైగల్లోనే నడిచింది. రెండోసారి కూడా రెవెన్యూ శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు.
భూ రికార్డులు, హక్కుల విషయంలో పారదర్శకత అవసరం..
‘భారతీయ సంస్కృతిలో మట్టికి–మనిషికి విడదీయరాని బంధం ఉంది. భూమి కేవలం ఆస్తి కాదని.. రైతు చెమటకు ప్రతీక. కుటుంబ భవిష్యత్తుకు భూమే భరోసా.. ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టపడి కొనుగోలు చేసిన చిన్న స్థలమైనా.. పంట పొలమైనా ఎంతో విలువైనదే. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములతో కుటుంబాల అనుబంధం ఉంది. భూమికి సంబంధించిన ప్రతి నిర్ణయం అత్యంత బాధ్యతతో ఉండాలి. భూ రికార్డులు, హక్కుల విషయంలో పారదర్శకత అవసరం. సాంకేతికతతో భూ రికార్డుల ఆధునికీకరణ జరగాలి. చిన్న రైతులు, సామాన్యుల భూ హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించాలి. భూమి విషయంలో జరిగే చిన్న తప్పు.. కుటుంబ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భూ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కీలకం. మట్టి మీద హక్కు అంటే.. కుటుంబ భవిష్యత్తుపై హక్కు’ అని మంత్రి పేర్కొన్నారు.
మాక్ అసెంబ్లీపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం..
మాక్ అసెంబ్లీపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే సభలోనే కూర్చొని చర్చించాలని అన్నారు. సభలో చర్చించకుండా బయట మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఎందుకు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఇక్కడే ఉందని.. ఇక్కడే కూర్చొని చర్చించవచ్చని తెలిపారు. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు.. హావభావాలను ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేత్రపర్వంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News