ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:39 PM
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఢిల్లీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandra Rao) విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని.. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వడ్లను కేంద్రం ఎప్పుడు కొనదని.. ఆయా రాష్ట్రాలు కొన్న దానికి మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ధాన్యం రోడ్లపై కుప్పలు కుప్పలుగా పడి ఉందని అన్నారు. బీజేపీ ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీ వేదికగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ విఫలం..
ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎంత పంట పడిందనే సమాచారం కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతుల వద్ద ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంతోనే ధాన్యం కొనుగోళ్ల సమస్యలు వచ్చాయని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ పోరాటంతోనే ఆయా కొనుగోలు కేంద్రాలకు లారీలను రేవంత్ ప్రభుత్వం పంపుతోందని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలోకి ఎవరు వెళ్తారనే విషయంపై కేంద్ర హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తాం..
రేపు ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా తమ పార్టీ జాతీయ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిందని అన్నారు. బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై పెట్టిన పోస్టర్లకు.. పార్టీలో గ్రూప్ తగాదాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాలు సృష్టించాలనే ఈటలపై ఎవరో పోస్టర్లు పెట్టారని మండిపడ్డారు. పోస్టర్లు పెట్టిన వారిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయంపై డీజీపీ, కమిషనర్‌కి ఫిర్యాదు చేశామని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News