Share News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

ABN , Publish Date - Jul 22 , 2026 | 08:55 AM

నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డిపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

 ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
Trainee IPS Uday Krishna Reddy Case

హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డిపై (Trainee IPS Uday Krishna Reddy Case) చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు తదుపరి దర్యాప్తును షీటీమ్స్‌కు అప్పగించారు. షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించనున్నారు.


ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఈరోజు (బుధవారం) డిశ్చార్జ్ కానున్నారు. ఆయన పేరుతో లభించిన ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా కోలుకున్న అనంతరం తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు.


తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి..

మరోవైపు, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు తప్పుడు ఆరోపణల ఆధారంగా నమోదైందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మహిళా అధికారి, తాను ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నామని తెలిపారు. ముస్సోరిలో శిక్షణ సమయంలో తమ మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం మహిళా అధికారి మరో ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నారని అన్నారు. ఆ వివాహం తర్వాత కూడా తనతో మహిళా అధికారి సంబంధం కొనసాగించాలని ప్రయత్నించారని ఆరోపించారు.


ఆ వీడియో తర్వాతనే నాపై క్రిమినల్ కేసు పెట్టారు..

అలాగే, గతంలో తమ సంబంధానికి సంబంధించిన వీడియోను ఆమె భర్తకు పంపించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, ఆ నేపథ్యంలోనే తనపై కోపంతో క్రిమినల్ కేసు నమోదు చేయించారని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. వీటి నిజానిజాలను దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానం నిర్ధారించాల్సి ఉంది. మహిళా అధికారి చేసిన ఫిర్యాదు, ఉదయ్ కృష్ణారెడ్డి వాదనలు, సేకరించిన ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ

ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల

ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 09:16 AM