విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:49 PM
నీట్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లీక్ కారకులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్నామని, నిందితులను జైల్లో పెట్టామని పేర్కొన్నారు.
ఢిల్లీ, జులై 21 (ఆంధ్రజ్యోతి): నీట్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లీక్ కారకులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్నామని, నిందితులను జైల్లో పెట్టామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. విద్యార్థులకు నష్టం కలగకుండా రీనీట్ నిర్వహించామని తెలిపారు. ఈరోజు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడారు. నీట్ పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ప్రధాని మోదీతో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పుకొచ్చారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ పున:పరీక్ష నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ఫలితాలను కూడా ఆలస్యం లేకుండా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అవసరమని ప్రధాని మోదీ సూచించారని కిరణ్ రిజిజు వెల్లడించారు. పేపర్ లీక్‌లను పూర్తిగా అణచివేయడానికి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా దేశంలోని ప్రముఖ న్యాయవాదులను నియమించాలని ప్రధాని సూచించారని తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ సమావేశంలో దేశ ఆర్థిక పురోగతి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు), ప్రభుత్వ విజయాలపై కూడా ప్రధాని సమీక్షించారని తెలిపారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల్లో రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రతి ఒప్పందాన్ని రూపొందిస్తున్నామని, వారి ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. ఎమ్మెల్యేల అలర్ట్
పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And National News
And Telugu News