Share News

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:05 PM

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.

తెలంగాణ ప్రజలను... కవిత తప్పుదోవ పట్టిస్తున్నారు: కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని కవిత చెప్పారని ప్రస్తావించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్ వేదికగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జేబులు చూసి పరిపాలించారని కవిత చెప్పారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గతంలో టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని చెప్పుకొచ్చారు.


కేసీఆర్ హయాంలో దోపిడీ చేశారు..

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను కేసీఆర్ హయాంలో దోపిడీ చేశారని ఎంపీ చామల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలోని పదేళ్లు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పంచుకునే వాటాల్లో తేడాలు వచ్చి ఆమె బయటకు వచ్చారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కవిత ఇప్పుడు బయటకు వచ్చి సీఎం, సీఎం అని నినాదాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అంటే కవితకు మార్కులు పడవని ఆక్షేపించారు. రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ, ఫ్యూచర్ సిటీ, ఉద్యోగాలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నందుకు కర్కోటకుడు అయ్యారా...? అని ఫైర్ అయ్యారు.


కవిత.. నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తాం..

కవిత పార్టీ పెట్టుకోవచ్చని, పోరాటం చేయొచ్చని, ప్రజల్లోకి వెళ్లవచ్చని తెలిపారు. తెలంగాణను దోచుకోవడానికే ఆమె సీఎం కావాలని అంటున్నారా..? అని నిలదీశారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఆమె తెల్లకాగితం కాదని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె పని చేశారని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని.. తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మరని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు

మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 05:01 PM