మొయినాబాద్ డ్రగ్స్ కేసు: సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:06 PM
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
హైదరాబాద్ , మార్చి 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుల వాంగ్మూలాలు ఈ కేసును మరో మలుపు తిప్పాయి. ముగ్గురు నిందితులను విడివిడిగా విచారిస్తున్న సిట్ బృందం పలు సంచలన విషయాలను రాబట్టింది. ప్రధాన నిందితుడు రోహిత్ రెడ్డి గత ఏడాది కాలంగా క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
తప్పుదోవ పట్టించిన కౌశిక్ రవి..
ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన అభిషేక్ సింగ్ అత్యంత కీలకంగా మారాడు. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు అతని డ్రైవర్ సిలివేరి శరత్, అవుటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద అభిషేక్ నుంచి డ్రగ్స్ సేకరించినట్లు సిట్ విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి, డ్రగ్స్ సిమ్లా నుంచి తెచ్చినట్లు పోలీసులకు చెప్పి దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, సిట్ తనదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.
మిస్టరీగా మారిన పెడ్లర్ అభిషేక్ సింగ్ పరారీ
డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటకు రాగానే పెడ్లర్ అభిషేక్ సింగ్ అదృశ్యమయ్యాడు. ఈ నెల 16 నుంచి తన కుమారుడు కనిపించడం లేదని అభిషేక్ తండ్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అభిషేక్ పరారీలో ఉన్నాడని, అతనిని పట్టుకుంటే ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఉన్న మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
సిట్ తదుపరి చర్యలు
నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిందితుల మొబైల్ ఫోన్లలోని కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. రోహిత్ రెడ్డి రక్త నమూనాలను సేకరించి, డ్రగ్స్ తీసుకున్న సమయాన్ని, రకాన్ని శాస్త్రీయంగా నిర్ధారించనున్నారు. ఈ కేసులో సెలబ్రిటీలు లేదా రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిట్ ఆరా తీస్తోంది. అభిషేక్ సింగ్ దొరికితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఘోర ప్రమాదం: మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. ఒకరికి సీరియస్
బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య.. సీఎంపై కిషన్‌రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And International News And Telugu News