తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మల్లు భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jun 15 , 2026 | 06:01 PM
రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 8 మేలురకం వరి వంగడాల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈరోజు(సోమవారం) ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు చేశారని తెలిపారు. ఆ 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు వస్తాయని వివరించారు.
విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్..
విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్ ఉందని భట్టి విక్రమార్క ప్రస్తావించారు. మద్దతు ధర (MSP) కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని వెల్లడించారు. BPT-5204, తెలంగాణ సోనామసూరి సహా ఎగుమతులకు అనుకూలమైన వరి రకాలపై రైతన్నలు దృష్టిపెట్టాలని సూచించారు. మార్కెట్ డిమాండ్ ఉన్న వరి రకాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ ఉన్న బియ్యం ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులకు మార్కెట్ ఆధారిత పంటల సాగుపై మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించామని అన్నారు. డిమాండ్ లేని వరి రకాల సాగును క్రమంగా తగ్గించాలని చెప్పారు. వినియోగదారులు, మిల్లర్లు కోరుకునే వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వానాకాలం సాగుపై ప్రత్యేక కార్యాచరణ..
ఎగుమతులకు అనుకూలమైన నిర్దిష్ట వరి రకాల సాగు విస్తరణపై దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క మార్గనిర్దేశం చేశారు. వానాకాలం సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రైతులకు నష్టాలు రాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక చేపట్టాలని సూచించారు. నాణ్యమైన బియ్యం ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రైతులకు లాభదాయకమైన, ఎగుమతి అవకాశాలు ఉన్న వంగడాలపై ప్రత్యేక ప్రోత్సాహకాలని పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలపై నిరంతర సమీక్షా సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తెలంగాణను అధిక విలువ కలిగిన వరి ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. రైతు ఆదాయం పెంపు, మార్కెట్ అనుసంధానానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామని అన్నారు. రైతులకు మెరుగైన ధరలు వచ్చేలా మార్కెట్ డిమాండ్ ఆధారిత వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
చిన్న తప్పులకూ ఉద్యోగ బహిష్కరణ సరికాదు: సుప్రీంకోర్టు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News