వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 06:19 PM
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. ఈరోజు(ఆదివారం)హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో వర్షాలు, ప్రకృతి విపత్తులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించాలి..
రాష్ట్రంలో వర్షాకాల పరిస్థితులు, వరద ముప్పు, పట్టణాలు, గ్రామాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇరిగేషన్, వ్యవసాయం, ఆర్ అండ్ బీ, జలమండలి వంటి విభాగాల ఉన్నతాధికారులు కూడా పాల్గొని తమ శాఖల సిద్ధతపై వివరాలు అందించారు. ఈ సమావేశంలో వరదల నివారణ, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, అత్యవసర సేవల సమన్వయం, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, ఎప్పటికప్పుడు అప్రమత్తత అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ప్రాజెక్టుల దగ్గర చర్యలు చేపట్టాలి..
వర్షాల సమయంలో ఆయా ప్రాజెక్టుల దగ్గర వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్వహణ పద్ధతి ప్రకారం జరగాలని సూచించారు. ఇంజినీర్లు కచ్చితంగా మాన్యువల్‌ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఉన్నతాధికారులు ఈ సీజన్‌లో ప్రాజెక్టుల దగ్గర ఉండాలని నిర్దేశించారు.పై అధికారుల అనుమతి లేకుండా ఇంజినీర్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, RWS అధికారులు సమన్వయంతో పనిచేయాలని హుకుం జారీ చేశారు. రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. రైతు వేదికలో యూరియా పంపిణీ బాధ్యతను స్థానిక అగ్రికల్చర్ అధికారికి అప్పగించాలని ఆదేశించారు. యూరియా పంపిణీలో రెవెన్యూ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలని సూచించారు.
అధికారుల మధ్య సమన్వయం ఎందుకు లేదు..
ఈ నెల 9వ తేదీన వర్షం పడిన సమయంలో అధికారులు తీరు సరిగా ఎందుకు లేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారుల మధ్య సమన్వయం ఎందుకు లోపించిందని నిలదీశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలని హుకుం జారీ చేశారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఫీల్డ్‌లో అందుబాటులోలేని విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి.. కిందిస్థాయి సిబ్బంది వరకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. అవసరమైతే తాను కూడా తనిఖీలకు వస్తానని స్పష్టం చేశారు. వర్షంతో ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ తప్పిదాలతో సమస్యలు వస్తే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ విభాగంలో తక్షణమే ఖాళీలు పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. అలాగే సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. పోలీస్ శాఖ నుంచి సజ్జనార్, రమేశ్ రెడ్డి, సుమతి వంటి పోలీస్ కమిషనర్లు పాల్గొన్నారు. అలాగే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News