జూబ్లీహిల్స్ 'రిచ్ కిడ్స్' ట్రాప్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
ABN , Publish Date - May 07 , 2026 | 10:48 AM
జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ బాలికల ట్రాప్ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. రిచ్ కిడ్స్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసిన ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన రిమాండ్ కాపీలో అనేక సంచలన అంశాలు బయటపడగా, మైనర్లను బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రిమాండ్ రిపోర్టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది. అందులో ఏముందంటే..
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్‌కు వల..
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ప్రధాన నిందితుడు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మొదట స్నేహంగా ప్రారంభమైన పరిచయం తర్వాత బలవంతపు సంబంధాలకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. అర్జున్‌తో పాటు రాజీవ్, వారి స్నేహితుల పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పలుమార్లు అర్జున్‌ను హెచ్చరించినప్పటికీ అతను తన ప్రవర్తన మార్చుకోలేదని సమాచారం. గత ఏడాదిలోనే అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
అరెస్ట్ అయినా మారని అర్జున్..
అర్జున్ గతంలోనే పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా అతను బాలికతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తిరిగి కనెక్ట్ అయ్యాడు. దీంతో కేసు మరింత తీవ్రమైంది. బాలిక కుటుంబం అర్జున్‌తో మాట్లాడొద్దని హెచ్చరించినా, ఇంట్లో పని చేసే సరస్వతి అనే మహిళ ఫోన్‌ను వినియోగించి బాలిక అతనితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
పనిమనిషి బ్లాక్‌మెయిల్..
ఈ కేసులో మరో కీలక పాత్రగా పనిమనిషి సరస్వతి పేరు బయటపడింది. మైనర్ బాలిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.9 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అర్జున్‌తో సంబంధాల విషయం బయటపెడతానంటూ బాలికను.. పనిమనిషి బెదిరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల్లో రూ.13 లక్షలు..
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పలు సందర్భాల్లో అర్జున్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో వివిధ అవసరాలు, సమస్యలు అంటూ బాధితురాలి నుంచి సుమారు రూ.13 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అర్జున్ అడిగిన డబ్బులు ఇవ్వడానికి బాలిక ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. తన తండ్రికి తెలియకుండా ఇంట్లోని కప్‌బోర్డ్ నుంచి లక్షల రూపాయలు తీసుకుని అర్జున్‌కు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
డబ్బులు కనిపించకపోవడంతో..
ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించకపోవడంతో బాలిక తండ్రికి అనుమానం వచ్చింది. డబ్బుల గురించి నిలదీయగా మొదట బాలిక సమాధానం చెప్పలేకపోయింది. తర్వాత అసలు విషయం బయటపడటంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి పలు కీలక ఆధారాలు సేకరించారు.
అర్జున్ తల్లి అకౌంట్లలో డబ్బుల లావాదేవీలు..
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అర్జున్ తల్లి మీనాకుమారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. బాధితురాలి నుంచి ఆమె ఖాతాలకు డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల ట్రాన్సాక్షన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరెవరు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారనే విషయంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
మరో బాధితురాలి ఫిర్యాదు..
ఈ కేసులో బాలికతో పాటు మరో యువతి కూడా అర్జున్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా ద్వారా యువతులను లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తున్న గ్యాంగ్‌పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ..
మొదట జూబ్లీహిల్స్ పరిధిలో నమోదైన ఈ కేసును తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్న పోలీసులు, త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోషల్ మీడియా మోసాలపై హెచ్చరిక..
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు?, ఎలాంటి అకౌంట్లను ఫాలో అవుతున్నారు? అనే విషయాలపై పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, బ్లాక్‌మెయిల్‌కు గురైతే వెంటనే కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News