Share News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హరీశ్‌రావుపై కొత్త ఎఫ్‌ఐఆర్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 04:21 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. హరీశ్‌రావుపై కొత్త ఎఫ్‌ఐఆర్‌
Harish Rao

  • హైకోర్టు ఆదేశాలతో సిద్దిపేటలో నమోదు

  • ఏ1గా హరీశ్‌, ఏ2గా టాస్క్‌ఫోర్స్‌ మాజీ బాస్‌ రాధాకిషన్‌రావు

హైదరాబాద్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సిద్దిపేట పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్‌ అనే వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా హరీశ్‌రావు, ఏ2గా రాధాకిషన్‌రావును పేర్కొన్నారు. నిజానికి, తన ఫోన్లు ట్యాప్‌ చేసి బెదింపులకు పాల్పడుతున్నారంటూ హరీశ్‌రావు తదితరులపై చక్రధర్‌గౌడ్‌ 2024 డిసెంబరు 1న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. హరీశ్‌రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విషయం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది.


అయితే, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడం, ఆర్ధిక సాయం చేస్తుండడంతో ప్రజల్లో తనకు మద్దతు పెరుగుతుండగా హరీశ్‌ రావు తదితరులు తనను బెదిరింపులకు గురి చేశారని చక్రధర్‌గౌడ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీశ్‌ నాటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావును అడ్డం పెట్టుకుని తనని భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ కేసుల్లో బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేయాలని పలుమార్లు పోలీసులను కోరినా పట్టించుకోలేదని తెలిపారు.


హరీశ్‌రావు తదితరుల ఆదేశాల మేరకు తనతోపాటు తన భార్య ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని, యాపిల్‌ సంస్థ నుంచి తమకు హెచ్చరిక సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు చక్రధర్‌ గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించగా.. సదరు కేసును పంజాగుట్ట నుంచి సిద్దిపేటకు బదిలీ చేసి కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసు బదిలీ అవ్వగా.. సిద్దిపేట పోలీసులు సెక్షన్‌ 120బీ, 386, 409, 506, 419, 420, 467, 406 రెడ్‌విత్‌ 34 ఐపీసీతో పాటు 66 డీ ఐటీ యాక్ట్‌ 2000 కింద హరీశ్‌ తదితరులపై కేసు నమోదు చేశారు. పంజాగుట్టలో హరీశ్‌ తదితరులపై పెట్టిన సెక్షన్లకు అదనంగా పలు సెక్షన్లు జోడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య

నేడే అమిత్‌ షా పాదయాత్ర

3 రోజుల పాటు భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 04:21 AM