Share News

వందల కోట్ల మనీలాండరింగ్‌లో హైదరాబాద్‌కు లింకు

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:54 AM

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ స్కామ్‌కు సంబంధించి ముంబైలో అరెస్టు చేసిన ముఠా సూత్రధారి సాగర్‌ దాష్‌ ఈడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు.

వందల కోట్ల మనీలాండరింగ్‌లో హైదరాబాద్‌కు లింకు
ED

  • ఆల్‌ ప్యానల్‌ ఎక్స్చేంజ్‌ నుంచి గోవా క్యాసినోల వరకు..

  • అక్కడికి చేరిన రూ.900కోట్లు

  • క్రిప్టో కరెన్సీగా మార్చి దేశం దాటించిన వైనం

  • నగదు రూపంలో రూ.332కోట్లు విత్‌డ్రా

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు

  • ముంబైలో ముఠా సూత్రధారి సాగర్‌ దాష్‌ అరెస్టు

  • ఈడీ విచారణలో కీలక విషయాలు వెల్లడి

  • హైదరాబాద్‌లో మ్యూల్‌ ఖాతాల ద్వారా నిధులు బదిలీ

  • జూబ్లీహిల్స్‌ మెర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు పాత్ర

హైదరాబాద్‌, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ స్కామ్‌కు సంబంధించి ముంబైలో అరెస్టు చేసిన ముఠా సూత్రధారి సాగర్‌ దాష్‌ ఈడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఈ నెల 27న సాగర్‌ను ముంబైలో అరెస్టు చేసిన ఈడీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆల్‌ ప్యానల్‌ ఎక్చేంజ్‌(ఏపీఎక్స్‌) పేరిట అంతరాష్ట్ర బెట్టింగ్‌ నిర్వహించిన సాగర్‌ దాష్‌ ముఠా మోసపూరితంగా సంపాదించిన సొమ్ము మొత్తాన్ని జూబ్లిహిల్స్‌ మెర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులోని మ్యూల్‌ ఖాతాల ద్వారా మళ్లించారని అధికారులు గుర్తించారు. ఈ మ్యూల్‌ ఖాతాల నుంచి వివిధ షెల్‌ కంపెనీలకు డబ్బు బదిలీ చేశారని, తర్వాత బెంగళూరులోని నాగరభావి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సోసైటీ నోడల్‌ అకౌంట్‌లోకి నిధులు చేరాయని గుర్తించారు. ఈ ఖాతాను సాగర్‌ స్ధాపించిన ఆర్మ్‌స్ర్టాంగ్‌ ఎక్చేంజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట నిర్వహిస్తున్నారని, నాగరభావి సొసైటీకి సంబంధించిన కేవైసీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి సాగర్‌ క్రిప్టో ఖాతా తెరిచాడని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కోఆపరేటివ్‌ సొసైటీ ఖాతా ద్వారా వందల కోట్ల రూపాయలు తరలించారని, ఇదంతా అక్రమ గేమింగ్‌, బెట్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చిన డబ్బు అని ఈడీ అధికారులు వివరించారు.


దేశవ్యాప్తంగా 20 చోట్ల ఈడీ అధికారుల సోదాలు

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో నమోదైన 3ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు అక్టోబరు 13న పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, సూరత్‌ సహా దేశవ్యాప్తంగా 20చోట్ల సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.9కోట్లు ఫ్రీజ్‌ చేశారు. ఇప్పటికే పేమెంట్‌ గేట్‌వేలకు సంబంధించి అడ్‌సమ్‌ ఫిన్‌టెక్‌ సీఈఓ రామ్‌ యు రాంధానిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఐ పైసా అనే సొంత పేమెంట్‌ గేట్‌వే నిర్వహిస్తున్న రాంధాని 200 షెల్‌ కంపెనీలను దీనికి అనుసంధానం చేసి డబ్బు లేయర్లు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 18న ఈడీ జరిపిన సోదాల్లో ముంబై, పూణే, సూరత్‌, బెంగళూరులోని 75 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.15కోట్ల మొత్తాన్ని ఫ్రీజ్‌ చేశారు. ముస్లిం కో ఆపరేటివ్‌ బ్యాంకు(ఎంసీబీ)లోని ఒక ఖాతా ద్వారా రూ.150కోట్లు, ఏపీఎంసీ మ్యూల్‌ ఖాతాల ద్వారా రూ.182కోట్లు విత్‌డ్రా చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.


ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా వచ్చిన డబ్బు ముందుగా మ్యూల్‌ ఖాతాల ద్వారా జూబ్లీహిల్స్‌ మెర్కంటైల్‌ బ్యాంకుకు, అక్కడి నుంచి బెంగళూరు కో ఆపరేటివ్‌ సోసైటీకి, అక్కడి నుంచి ఫూణే ఫిన్‌టెక్‌ కంపెనీకి, దాని నుంచి 200 షెల్‌ కంపెనీలకు, చివరకు గోవా క్యాసినోలకు చేరి క్రిప్టో కరెన్సీగా మారిందని అధికారులు గుర్తించారు. గోవా క్యాసినోలకు రూ.900కోట్లు చేరాయని, అందులో రూ.200కోట్లు అధికారికంగా, రూ.700కోట్లు అనధికారికంగా ఇచ్చిన విషయం ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీఎక్స్‌తో పాటు విచారణలో బయటపడిన ఎంజీఎం91 బెట్టింగ్‌ యాప్‌ల వెనుక సముందర్‌ సింగ్‌ రాధోడ్‌, ముఖేష్‌ జైన్‌ల పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సొమ్ములో నగదు రూపంలో విత్‌డ్రా అయిన దాదాపు రూ.332కోట్ల ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రాజకీయంగా అండగా నిలిచిన వారికి మామూళ్లు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతుందని, సాగర్‌ కస్టడీ పూర్తి అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 04:54 AM