సైనికుడి ఓటునూ తొలగించారు
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:51 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో తమ ఓట్లను అన్యాయంగా ఓటరు జాబితా నుంచి తొలగించారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బతికి ఉండగానే చనిపోయారని చెప్పి ఓట్లు తీసేశారు
తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరం పబ్లిక్
హియరింగ్‌లో బాధితుల ఆవేదన
తిరుమలగిరిలో బూత్ 150, 151లోని ఓటరు జాబితాపై సోషల్ ఆడిట్
ఎస్‌ఐఆర్ పూర్తిగా ఓట్లు తొలగించడానికి చేపట్టిన ప్రక్రియ: జ్యూరీ సభ్యులు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో తమ ఓట్లను అన్యాయంగా ఓటరు జాబితా నుంచి తొలగించారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తిరుమలగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరం ప్రజా విచారణ నిర్వహించింది. జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ శాంతాసిన్హా, పరకాల ప్రభాకర్, ఫర్హాన్, సిస్టర్ మంజుల, మరియా తబుస్సుమ్, జోస్ మాల్యేకల్ తదితరుల సమక్షంలో నియోజకవర్గంలోని బూత్ నెంబర్లు 150, 151 పరిధిలో ఓటు హక్కు కోల్పోయిన పలువురు బాధితులు తమ వాదన వినిపించారు. స్థానిక మహిళ ప్రియా జోసెఫ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో సైనికుడిగా పనిచేస్తున్న తన భర్త జోసెఫ్ ఓటును.. విచారణకు హాజరుకాలేదన్న కారణంతో జాబితా నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తంచేసింది. బీఎల్‌వో నుంచి ఎస్‌ఐఆర్ ఫారమ్‌లు తమకు అందలేదని చెప్పారు. అడ్ర్‌సలో లేడనే నెపంతో ఆర్మీలో పని చేస్తున్న తన భర్త ఓటును రద్దు చేయడం న్యాయమేనా? నిలదీసింది.
న్యాయవాది గణేష్ మాట్లాడుతూ.. శాశ్వతంగా మరొక ప్రాంతానికి మారారన్న తప్పుడు నెపం చూపి కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తన ఓటును తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారమ్ నింపి బీఎల్‌వోకు ఇచ్చినప్పటికి తన పేరును అన్‌ట్రెసేబుల్ పేరుతో ముసాయిదా జాబితా నుంచి తొలగించారని అరుణ్ కుమార్ అనే వ్యక్తి చెప్పారు. ఇలా 30 మందికి పైగా బాధితులు తమ గోడు వెలిబుచ్చారు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చూపి ఓటు తొలగించడం, ఆరుగురికంటే ఎక్కువ సంతానం కలిగిన కుటుంబం లోని ఓట్లు తీసేయడం లాంటి సమస్యలను జ్యూరీ సభ్యులు గుర్తించారు. ఓటర్ల అనుభవాలు విన్న తరువాత ఎస్‌ఐఆర్ పూర్తిగా ఓట్లు తొలగించడానికి చేపట్టిన ప్రక్రియగా మారిందని జ్యూరీ సభ్యులు విమర్శించారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే మార్గమని ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు.
అనర్హుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారన్న వాదనలో వాస్తవం లేదనడానికి ఈ పబ్లిక్ హియరింగులో బాధితుల వాదనే సాక్ష్యమని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు బీఎల్‌వోల పొరపాట్ల వల్ల జరగలేదని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్మాణంలోనే లోపం ఉందని సామాజిక వేత్త ఫర్హాన్ విమర్శించారు. హైదరాబాద్‌లో 41 శాతం ఓట్లు తొలగించారని, వారంతా చొరబాటుదారులేనా అని మరియా తబస్సుమ్ ప్రశ్నించారు. పబ్లిక్ హియరింగ్‌కు ముందు 150, 151 బూత్‌ల పరిధిలోని ఓటర్ల జాబితాపై తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరమ్ కార్యకర్తలు రెండు వారాలపాటు ఇంటింటికీ తిరిగి సోషల్ ఆడిట్ నిర్వహించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2025 ఓటర్ల జాబితాలో 1,829 మంది ఓటర్లలో 721 మంది పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు తేలింది. ముసాయిదాలోని 1,101 మంది ఓటర్లలో 821 మంది సాంకేతిక లోపాలు లేదా 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలతో నోటీసులు అందుకున్నట్లు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News