Share News

మియాపూర్‌ భూముల అమ్మకానికి రేవంత్‌ కుట్ర

ABN , Publish Date - Nov 01 , 2026 | 04:07 AM

ప్రభుత్వ భూముల పరిరక్షణపై సీఎం రేవంత్‌ శుక్రవారం ఢిల్లీలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలని బీఆర్‌ఎస్ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు అన్నారు.

మియాపూర్‌ భూముల అమ్మకానికి రేవంత్‌ కుట్ర
Harish Rao

  • వాటిని తన బినామీలకు కట్టబెట్టేందుకు కలెక్టర్లను పరుగులు పెట్టిస్తున్నారు

  • ప్రభుత్వ భూముల్ని కాపాడింది

  • కేసీఆర్‌ సర్కార్‌.. రేవంత్‌ క్రెడిట్‌ చోరీ

  • గ్రేహౌండ్స్‌ భూములను కేసీఆర్‌ కాపాడితే

  • సంతోష్‌‌రెడ్డికి కట్టబెట్టారు

  • మంచిరేవులలో రూ.2,000 కోట్ల

  • భూకుంభకోణం: హరీశ్‌రావు

హైదరాబాద్‌, నార్సింగ్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల పరిరక్షణపై సీఎం రేవంత్‌ శుక్రవారం ఢిల్లీలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలని బీఆర్‌ఎస్ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పదేళ్లపాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదించి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడితే... ఇప్పుడు రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా ‘క్రెడిట్‌ చోరీ’ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ భూములను అమ్ముకునేందుకు, తన బినామీలకు కట్టబెట్టేందుకు రేవంత్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ కాపీ ఇంకా చేతికి రాకముందే మియాపూర్‌ భూములను అమ్మడానికి రేవంత్‌ రెడ్డి కలెక్టర్లను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. మియాపూర్‌ కేసు సుప్రీం కోర్టులో మొత్తం 192సార్లు విచారణకు వచ్చిందని, తెలంగాణ రాకముందు 86సార్లు, తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్‌ హయాంలో 95 సార్లు విచారణ జరిగిందన్నారు.


అందులో 86 సార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించిన సీనియర్‌ కౌన్సిల్‌ సి.ఎస్.వైద్యనాథన్‌ వాదనలు వినిపించి కేసును తుది దశకు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమేనని, కానీ.. రేవంత్‌రెడ్డి మాత్రం తానే వైద్యనాథన్‌ను పెట్టి గెలిపించినట్లు పచ్చి అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. మియాపూర్‌ భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించింది అప్పటి కాంగ్రెస్‌ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అని గుర్తుచేశారు. అలాగే.. మంచిరేవులలో రూ.10 వేల కోట్ల విలువైన 142 ఎకరాల భూమిని తానే కాపాడానంటూ రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధం చెప్పారన్నారు. నాడు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పోరాడి 142 ఎకరాల గ్రేహౌండ్స్‌ భూమిని కాపాడింది తామని, కానీ, రేవంత్‌రెడ్డి తమపైనే నిందలు వేస్తున్నారన్నారు. ఇదే గ్రేహౌండ్స్‌ భూమిలో మృగవని పక్కన దక్షిణ వైపు 30 ఏళ్లుగా ఉన్న ప్రహరీ గోడను రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రాత్రికి రాత్రే పడగొట్టారని ఆరోపించారు. 10.10 ఎకరాల భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు వదిలేసి, రెండు రోజుల్లో లోపలికి కొత్త కాంపౌండ్‌ వాల్‌ను కట్టారని తెలిపారు.


మహమ్మద్‌ అమీర్‌ సలావుద్దీన్‌ తదితరులు 9 మంది ద్వారా.. ‘డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, ‘డ్రీమ్‌ వ్యాలీ ప్రాపర్టీ్‌స(ప్రతినిధి కె.సంతోష్‌రెడ్డి)’ పేరు మీద ఈ 10.10 ఎకరాలను.. అదీ జీరో వాల్యూతో రిజిస్ట్రేషన్‌ చేశారని పేర్కొన్నారు. రూ.1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టారని ఆరోపించారు. ఇక గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ రేంజ్‌కు స్థలం సరిపోవడం లేదని పక్కనే ఉన్న మరో 10 ఎకరాల కోసం 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ను ఇచ్చిందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు కోర్టుకు వెళ్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 2026 సెప్టెంబర్‌ 3న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసిందన్నారు. అంటే పరోక్షంగా మరో రూ.1,000 కోట్ల విలువైన 10 ఎకరాలను ప్రైవేట్‌ వ్యక్తులకు వదిలేశారని తెలిపారు. ఇలా మంచిరేవులలో మొత్తంగా రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై దమ్ముంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల సెంట్రల్‌ యూనివర్సిటీ భూమిని కేసీఆర్‌ కాపాడి చెట్లు పెంచితే... రేవంత్‌ ఆ భూమిని బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో తాకట్టు పెట్టి అధిక వడ్డీకి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చాడని ఆరోపించారు. ఇందుకు ఒక ముంబై బ్రోకర్‌కు రూ.400 కోట్ల లంచం(కమీషన్‌) ఇచ్చారన్నారు.


బిల్డర్‌ కోసం..5 వేల మంది జీవితాలతో చెలగాటం

నార్సింగ్‌లోని 100 అడుగుల రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుతో నష్టపోతున్న కాలనీలను హరీశ్‌ కాలినడకన శనివారం సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం కుటుంబం నిర్మించే స్కూల్‌ కోసం, బిగ్‌ బ్రదర్‌ భాగస్వామి అయిన ఆర్‌ఆర్‌ రియాల్టీ హైరేజ్‌ భవనాల కోసమే నార్సింగ్‌లో 100 ఫీట్ల రోడ్డు అలైన్‌మెంట్‌ను వంకరటింకరగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. ఒక బిల్డర్‌ ధనదాహం కోసం 10 అపార్ట్‌మెంట్లు, 5 వేల మంది జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని హరీశ్‌ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 04:07 AM