నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
ABN , Publish Date - May 15 , 2026 | 06:06 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, మే 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
విద్యార్థులు ఓడిపోలేదు..
లఖింపూర్ ఖేరీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ మిశ్రా చివరిసారిగా ‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను’ అని చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న హృతిక్, పరీక్ష రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ ఘటనలు కేవలం ఆత్మహత్యలు కావని, అవినీతి వ్యవస్థ చేసిన హత్యలని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పరీక్ష చేతిలో విద్యార్థులు ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో బలయ్యారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
148 పరీక్షల కుంభకోణాలు..
2015 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 148 పరీక్షల కుంభకోణాలు వెలుగుచూశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటిలో 87 పరీక్షలు రద్దయ్యాయని, దాదాపు 9 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితమైందని పేర్కొన్నారు. ఈ 148 కుంభకోణాల్లో కేవలం ఒక్కరికే శిక్ష పడిందని, సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు నమోదు చేసినప్పటికీ ఎవరూ బాధ్యత వహించలేదని విమర్శించారు. ప్రత్యేకంగా నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య ప్రవేశ పరీక్షల్లోనే 15 కుంభకోణాలు జరిగాయని అన్నారు. ఈ వ్యవహారాల్లో బాధ్యులైన అధికారులు, మంత్రులు రాజీనామా చేయకపోవడం అత్యంత సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కొందరిని తొలగించినట్లు చూపించి, తిరిగి ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు.
ఎవరినీ వదిలిపెట్టం..
‘మోసానికి సహకరించే వారికి బహుమతులు లభిస్తుండగా, పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని (PM Narendra Modi) ఉద్దేశించి, ‘మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు కావాలి?’ అని ప్రశ్నించారు. విద్యార్థుల బాధ తన బాధ అని, వారి భవిష్యత్తును దోచుకున్న వారు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎంత కాలం పట్టినా సరే, ఎవరినీ వదిలిపెట్టం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’ అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News