Share News

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

ABN , Publish Date - May 14 , 2026 | 07:00 PM

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Formula E Race Case

హైదరాబాద్, మే14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. జూలై 31వ తేదీన విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


ఫార్ములా ఈ రేస్ కేసును స్వీకరించిన ఏసీబీ కోర్టు..

2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై నమోదైన కేసులో ఇప్పటికే ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. తాజాగా ఆ ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం కీలకంగా మారింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు, ఏ5గా ఎఫ్ఈఓ సంస్థను చేర్చింది.

రూ.55 కోట్ల బదిలీపై ఆరోపణలు..

ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణ కోసం విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈఓకు నిధులు బదిలీ చేసిన వ్యవహారంపై ఈ కేసు నమోదైంది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నిధుల బదిలీ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అనుమతులు, విధివిధానాలు పాటించకుండా చెల్లింపులు జరిగాయా అనే అంశంపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.


ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన ఏసీబీ..

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డితో పాటు ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. పలువురు అధికారుల వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ద్వారా అభియోగపత్రం సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం.

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్..

ఫార్ములా ఈ కారు రేసు కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఈ అంశంపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరుగుతోందని చెబుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 07:43 PM