Share News

సీజేపీ నిరసన వేళ డీఎంకే కీలక భేటీ.. మూడో కూటమి దిశగా అడుగులు.!

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:10 PM

దేశవ్యాప్తంగా 'సర్‌'కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో డీఎంకే కీలక సమావేశానికి సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే.స్టాలిన్‌ అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు.

సీజేపీ నిరసన వేళ డీఎంకే కీలక భేటీ.. మూడో కూటమి దిశగా అడుగులు.!
DMK Holds Key Meet Amid MK Stalin's SIR Third Front Moves

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో డీఎంకే కీలక సమావేశానికి సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే.స్టాలిన్‌ అధ్యక్షతన నేడు(శనివారం) చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఇందులో 'సర్', నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు సహా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


'సర్' వ్యతిరేక పోరాటంలో భాగంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు దిశగా డీఎంకే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)తో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్‌తో సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో డీఎంకే కొత్త రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించిందని, అయితే ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.


ఎన్నికల కమిషన్ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు స్టాలిన్. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆచూకీ వెల్లడించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాంతియుత నిరసనలను అణచివేసే ప్రయత్నాలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు. కాగా.. గతంలో ఇతర సీజేపీ నాయకుల నిర్బంధంపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.


ఇవీ చదవండి:

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

Updated Date - Oct 17 , 2026 | 01:10 PM