ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:39 AM
ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద చర్యలు చేపట్టగా.. నిర్బంధ ప్రక్రియ పూర్తయ్యాక నేహా బోరాను విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు అట్టుడుకుతున్న వేళ పటిష్ఠ చర్యలు చేపట్టారు పోలీసులు. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం సాయంత్రం ముందస్తుగా అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంతో ఆయనపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126, 170 కింద చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన్ను ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్(ఎస్ఈఎమ్) ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిసింది.
అఖిల భారత విద్యార్థి సంఘం(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీలో నిర్వహించిన 'లెహ్రా దో తిరంగా' నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లే క్రమంలో ఇరువురినీ అరెస్ట్ చేశారు. దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని సీజేపీ న్యాయ విభాగాధిపతి రత్నసింగ్ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. దీప్కేను అరస్ట్ చేసి ప్రత్యేక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం దీప్కే ఎక్కడున్నారనే విషయం తనకు తెలియదన్నారు.
కాగా.. దీప్కేను రహస్య ప్రదేశానికి తరలించారని, ఆయనతో తమకు సంబంధాలు తెగిపోయాయని సీజేపీ ఆరోపించింది. తమ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీలోని మంగోల్పురిలో ఉన్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఆఫీస్లో ఒంటరిగా ఉంచారని ఏఐఎస్ఏ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసింది. తమ నేతలను కలిసేందుకు న్యాయవాదులు, సహచరులకు కూడా అవకాశమివ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే.. నిర్బంధ సంబంధిత ప్రక్రియ పూర్తయ్యాక బోరాను పోలీసులు విడుదల చేశారు.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 100వ స్థానం
ప్రతీ ఒక్కరూ జర్నలిస్టే అనుకుంటే.. అది ఇంకా పెద్ద సమస్య: సుప్రీంకోర్టు