ప్రతీ ఒక్కరూ జర్నలిస్టే అనుకుంటే.. అది ఇంకా పెద్ద సమస్య: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:21 AM
‘దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు తమను తాము జర్నలిస్టులం అని చెప్పుకొంటే అది ఇంకా పెద్ద సమస్య. ప్రతీ ఒక్కరికి సమస్యలా మారుతుంది’’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 16: ‘‘దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు తమను తాము జర్నలిస్టులం అని చెప్పుకొంటే అది ఇంకా పెద్ద సమస్య. ప్రతీ ఒక్కరికి సమస్యలా మారుతుంది’’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ‘‘రాజ్యాంగం ఆర్టికల్ 19కింద కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ.. ప్రతీ ఒక్కరు తమని తాము జర్నలిస్టులం అని చెప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తోందా అన్నదానిపై సమగ్ర పరిశీలన అవసరం’’ అని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆందోళనలను కవర్ చేస్తున్న కొందరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఫ్రీలాన్సింగ్, ఇండిపెండెంట్ జర్నలిస్టుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారని, వీళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సంస్థల గుర్తింపు(అక్రెడిటేషన్) ఉన్న జర్నలిస్టులకు ఉన్నట్లే ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టుల భద్రతకు కూడా మార్గదర్శకాలు ఉండాలని పిటిషనర్లు కోరారు.