Share News

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

ABN , Publish Date - Oct 17 , 2026 | 10:13 AM

ఢిల్లీ హైకోర్టు వద్ద ఫుట్‌పాత్‌లు, రోడ్డు దాటే క్రాసింగ్‌లు ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణలోగా సదుపాయాలు కల్పించకపోతే తామే ధర్నాకు దిగుతామని హెచ్చరించింది.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక
Supreme Court warns Delhi Govt over missing footpath

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అధికార యంత్రాంగంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు వద్ద పాదచారుల కోసం ఫుట్‌పాత్‌, రోడ్డు దాటేందుకు క్రాసింగ్‌ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. త్వరలోనే ఆ సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణలోగా ఏర్పాటుచేయకపోతే.. తామే అక్కడ స్వయంగా ధర్నాకు దిగుతామని న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ కేవీ వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం హెచ్చరించింది. పనులు పూర్తయ్యేదాకా అక్కడి నుంచి కదిలేదే లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా కోర్టుకు పిలిపిస్తామని స్పష్టం చేసింది.


సురక్షితమైన ఫుట్‌పాత్‌లు పౌరుల ప్రాథమిక హక్కుల్లో భాగమని న్యాయస్థానం తెలిపింది. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు), 19(1)(డీ) (స్వేచ్ఛగా తిరిగే హక్కు)కు సంబంధించిన అంశాలని వివరించింది. పాదచారుల హక్కులే తొలి ప్రాధాన్యమన్న ధర్మాసనం.. వాహన రాకపోకల కంటే వాటికే పెద్దపీట వేయాలని పేర్కొంది. ఈ మేరకు రోడ్ల వెంట ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వాలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించింది. అక్రమ దుకాణాలు, కరెంట్ స్తంభాలు, చెత్త, అక్రమ పార్కింగ్‌ వంటి అడ్డంకులను తక్షణమే తొలగించాలని సూచించింది. ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో ఐఆర్‌సీ 103:2022 మార్గదర్శకాలను పాటించడం సహా దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, జారని ఉపరితలాలు ఏర్పాటుచేయాలని తెలిపింది.


పాదచారుల మార్గాల నిర్వహణపై తనిఖీలు, భద్రతా ఆడిట్‌లు చేపట్టడం సహా ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా న్యాయస్థానం సూచించింది. తొలి దశలో భాగంగా.. 5 నగరాల్లో ఫుట్‌పాత్‌ల అభివృద్ధికి పైలట్‌ ప్రాజెక్ట్ చేపట్టాలని, వీటి అమలు పర్యవేక్షణకు కేంద్ర స్థాయిలో ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని పేర్కొంది. కమిటీలు వేయడంతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. విశాలమైన రోడ్లు, వాటిపై తిరిగే వాహనాలే అభివృద్ధికి కొలమానం కాదని.. ప్రజలు సురక్షితంగా, గౌరవంగా నడిచే సదుపాయాలు కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది.


ఇవీ చదవండి:

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం

Updated Date - Oct 17 , 2026 | 10:33 AM