Share News

గంభీర్‌ ప్లాన్‌లో మార్పు లేనట్టే.. వైభవ్‌కు మరోసారి నిరీక్షణ తప్పదా.!

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:55 AM

వెస్టిండీస్‌తో నేడు ఐదో టీ20 జరగనుండగా తుది జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు వైభవ్.

గంభీర్‌ ప్లాన్‌లో మార్పు లేనట్టే.. వైభవ్‌కు మరోసారి నిరీక్షణ తప్పదా.!
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీకి నిరీక్షణ తప్పేలా లేదు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌‌లో ఇప్పటివరకు తుది జట్టులో స్థానం దక్కకపోగా.. ఐదో టీ20కి ముందు అతడు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఆసక్తి రేపుతోంది. ‘స్టిల్‌ బిలీవింగ్‌(ఇంకా నమ్మకంతోనే ఉన్నా)’ అంటూ ఈ యువ సంచలనం జట్టులో తన స్థానంపై స్పందించాడు.


కాగా.. విండీస్‌తో సిరీస్‌ 2-2తో సమంగా ఉండటంతో చివరి మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ క్రమంలో బేబీ బాస్‌కు తుది జట్టులో స్థానం కల్పించడంపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. అయితే ప్రస్తుత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌లను పక్కనపెట్టి అతడికి అవకాశమిచ్చేందుకు టీమ్ఇండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వైభవ్‌ స్థానంపై గంభీర్‌ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో సంజూ తానేంటో నిరూపించుకున్నాడని.. కొన్ని వైఫల్యాల కారణంగా ఆటగాళ్లపై విశ్వాసం కోల్పోకూడదని అభిప్రాయపడ్డాడు.


‘ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన ఆటగాడికి ప్రతిభ లేదని చెప్పలేం. సంజూ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వాళ్లను తక్కువ చేయలేం’ అని గౌతీ చెప్పాడు. వైభవ్ కోసం జట్టు కూర్పును మార్చడం సముచితం కాదన్నాడు. ఇక.. వైభవ్‌ ప్రతిభపై తమకు పూర్తి అవగాహన ఉందన్న గంభీర్.. కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నాడు. వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు అతడికీ తగినన్ని మ్యాచ్‌లాడే వీలు కల్పిస్తామని తెలిపాడు. దీంతో ప్రస్తుతానికి వైభవ్‌ వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.


ఇవీ చదవండి:

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Updated Date - Oct 17 , 2026 | 09:02 AM