తిరుమలలో రథసప్తమి వేడుకలు.. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:32 PM
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తిరుమల, జనవరి23(ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే రథసప్తమి పర్వదినాన్ని (Tirumala Ratha Saptami) పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary) తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ఈ ఏడాది తొలిసారిగా ఏఐ(Artificial Intelligence) టెక్నాలజీని వినియోగించి క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు విశ్లేషించి, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మాడ వీధుల్లో షెడ్లు
గతేడాది రథసప్తమి సందర్భంగా భక్తులు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లో షెడ్లు ఏర్పాటు చేశామని వెంకయ్య చౌదరి తెలిపారు. దీని ద్వారా వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులు ఎండ, వర్షాల నుంచి రక్షణ పొందుతారని పేర్కొన్నారు.
14 రకాల ప్రసాదాల పంపిణీ
రథసప్తమి రోజున వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా 14 రకాల ప్రసాదాలను పంపిణీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రసాదాల సరఫరాలో ఎలాంటి లోటు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ ఈఓ తెలిపారు.
9 లక్షల లడ్డూలు..
భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 లక్షల లడ్డూలను ముందుగానే నిల్వ ఉంచామని వెంకయ్య చౌదరి చెప్పారు. లడ్డూల విక్రయంలోనూ భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని నియమించామన్నారు.
త్వరితగతిన శ్రీవారి దర్శనం..
రథసప్తమి పర్వదినాన లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, భక్తులకు త్వరితగతిన మూల విరాట్టు(వేంకటేశ్వర స్వామి) దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెంకయ్య చౌదరి ప్రకటించారు. దర్శన క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
భారీ భద్రతా ఏర్పాట్లు..
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అదనపు ఈఓ వివరించారు. 400 మంది టీటీడీ సిబ్బందిని, డిప్యుటేషన్‌పై మరో 2400 మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..
రథసప్తమి రోజున భక్తులు టీటీడీ సూచనలు పాటించాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని అదనపు ఈవో కోరారు. భక్తుల సహకారంతో దర్శనాలు సాఫీగా జరుగుతాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
Read Latest AP News And Telugu News