అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:14 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్‌బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అమరావతి, జనవరి23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్‌బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని.. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు.
రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని.. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్దఎత్తున ఇవ్వాలని.. అప్పుడే అన్నిరంగాల్లో వారు ఎదుగుతారని చెప్పుకొచ్చారు. వారికోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని.. బ్యాంకర్ల వైపు నుంచీ సహకారం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని.. పేద, ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలని సూచించారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. బ్యాంకులతో సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని సీఎం వివరించారు.
టిడ్కో ఇళ్లకు రుణాలు ఇవ్వాలి..
ఇటీవలే 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని.. సంబంధిత నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలని సూచించారు సీఎం. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే.. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదని తెలిపారు.
15 రకాల ఛార్జీలు వేస్తున్నారు..
ఈ సమస్య పరిష్కారానికి తమ వైపు నుంచి ప్రయత్నిస్తున్నామని.. బ్యాంకర్లు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని, బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలన్నారు. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని.. వైసీపీ ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించిందని ప్రస్తావించారు. ఇప్పుడీ భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
Read Latest AP News And Telugu News