Share News

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:59 PM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్
CBI Charge Sheet

అమరావతి, జనవరి 23: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో 2019 నుంచి 2024 వరకు జరిగిన అవినీతి, కల్తీపై దర్యాప్తు చేపట్టిన సిట్.. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో 12 మంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులూ ఉన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న కూడా ఉన్నారు. ఇంకా 11 మంది టీటీడీ ఉద్యోగులను నిందితులుగా చేర్చడానికి టీటీడీ ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు.


దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. 2019 నుంచి 2024 వరకు లడ్డూ తయారీకి రూ.235 కోట్ల విలువైన 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని ఉపయోగించారని సిట్.. నిగ్గు తేల్చినట్టు ప్రచారం జరుగుతోంది. నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి ఇచ్చినప్పటికీ, సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ కీలక పాత్ర పోషించిందని సిట్ తన దర్యాప్తులో వెల్లడించింది. భోలేబాబా డెయిరీ యజమానులు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్టు సిట్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.


భోలేబాబా డెయిరీలో అసలు పాలు, నెయ్యి ఉత్పత్తి లేకపోయినా.. టీటీడీ అధికారులు నెయ్యి నాణ్యత బాగుందని నివేదికలు ఇచ్చారని.. తిరుమలకు వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి నాణ్యతను సరిగా పరీక్షించలేదని సిట్ తేల్చింది. ఫలితంగా శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యత దెబ్బతిన్నదని.. అప్పట్లో భక్తులు దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని సిట్ పేర్కొంది. ఎవరెవరికి ఎంత కమీషన్లు వెళ్లాయనే సమాచారంతో పాటు లావాదేవీల వివరాలనూ సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. నిబంధనలు మార్చడం వెనుక ఎవరున్నారనే అంశాలపైనా ఛార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొన్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి...

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 04:27 PM