Share News

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:50 PM

ఫోన్ ట్యాపింగ్‌‌పై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుందని తెలిపారు.

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ.. రేవంత్‌పై ప్రవీణ్ తీవ్ర విమర్శలు
RS Praveen Kumar

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన గోప్యమైన అంశమని ఆయన అన్నారు. ‘దేశ భద్రత, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుంది. బ్రిటిష్ కాలం నుంచి టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దీనిని అధికారికంగా ధ్రువీకరించారు’ అని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.


బజారున పడేశారు..

అయితే, రేవంత్ రెడ్డి ఈ గోప్య అంశాన్ని 'బజారున పడేశారు' అని ఆరోపించారు. ‘మన్మోహన్ సింగ్‌కు ఉన్న స్టేచర్ రేవంత్‌కు లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఏ రాజకీయ నాయకుడికీ తెలియదు. హోం మంత్రికి కూడా ఎస్‌ఐబీ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు. కానీ రేవంత్ వికృత క్రీడలకు ఈ వ్యవస్థలను దిగజార్చారు’ అని ఆయన మండిపడ్డారు. పోలీసులు ప్రమోషన్ల కోసం రేవంత్‌కు వత్తాసు పలుకుతున్నారని, బీఆర్‌ఎస్ నాయకులను వేధించేందుకు అక్రమ సిట్ ఏర్పాటు చేశారని ఆయన ధ్వజమెత్తారు.


మీరు బలికావొద్దు...

సజ్జనార్‌ను సిట్ చీఫ్‌గా నియమించడంపై ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సజ్జనార్‌పై 7 కేసులు ఉన్నాయి. ఆయనకు, డీజీపీ శివధర్ రెడ్డికి ఈ కేసు విచారించే నైతిక హక్కు లేదు. లోతైన విచారణ జరిగితే సజ్జనార్‌పైనే జరగాలి’ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో లేనిపోని సంబంధాలు కల్పిస్తున్నారని, చట్టపరంగా మాత్రమే ట్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని... రేవంత్ రాజకీయ క్రీడలో పోలీసులు బలికావొద్దని హెచ్చరించారు.


అక్రమ కేసులు..

బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌ రావుపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ సంపదను నైని కోల్ బ్లాక్ దోచుకుంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ కూల్చివేసిందన్నారు. రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు వల్లే రేవంత్ దౌర్జన్యాలపై బీజేపీ మౌనంగా ఉందని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 03:31 PM