Share News

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:13 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణను ప్రారంభించిన సిట్ అధికారులు.. కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.

సిట్ ముందుకు కేటీఆర్.. ఆ విషయాలపైనే విచారణ
KTR Phone Tapping Case

హైదరాబాద్, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ మరింత ఊపందుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ పార్టీ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన సిట్.. ఆ విషయంపైనే ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటిపైనే సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారి శ్రీధర్ రావు ఫిర్యాదు ప్రకారం.. తనను బెదిరించి 12 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పించారని, అదనంగా ఓ ప్రైవేట్ పంచాయతీలో మరో రూ.3 కోట్లు ఇప్పించారని తెలిపారు. ఇదే తరహాలో మరికొందరు వ్యాపారులు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో శ్రీధర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నేతలపై బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశాలపై కేటీఆర్ నుంచి సిట్ వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు సమాచారం.


కాగా.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పీఎస్‌కు రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌ రావ్ విచారణ సందర్భంగా పీఎస్ వెలుపల చోటుచేసుకున్న పరిణామాలతో మరింత పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు అధికారులు. టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పీఎస్‌ వద్దకు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో గులాబీ శ్రేణులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.


ఇవి కూడా చదవండి...

లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు

ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 11:33 AM