ఏ అక్రమాలకు పాల్పడలేదు.. మానసిక క్షోభకు గురిచేశారు: కేటీఆర్
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:56 AM
తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి బయల్దేరే ముందు మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశానని, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదన్నారు.
హైదరాబాద్, జనవరి 23: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నార్సింగి నివాసం నుంచి మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు కేటీఆర్. సిట్ విచారణకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. గత పదిహేనేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశానని, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి టైమ్ పాస్ రాజకీయాలు చేయలేదన్నారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేశామని తెలిపారు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదని, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.
రోజుకో కొత్త డ్రామా..
మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్.. ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ప్రజల కోసం చేశామని చెప్పారు. గత రెండేళ్లుగా తెలంగాణ.. పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా రేవంత్ ప్రభుత్వానికి లేదన్నారు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలాడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాపై వ్యక్తిత్వ హననం జరుగుతోంది..
‘నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను.. నేను ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదు. నా మీద తీవ్రమైన వ్యక్తిత్వ హననం జరుగుతోంది. నన్ను ఏదో డ్రగ్స్ కేసులోనో, హీరోయిన్లతో సంబంధాల కేసుల్లోనో ఇరికించాలని చూశారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలనూ మానసిక క్షోభకు గురి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్లు సమాధానం చెప్పాలి. గత రెండేళ్లుగా ఒక సీరియల్‌లాగా లీకులు ఇస్తూ నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి సిట్ విచారణకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్ రావు కూడా జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు.
ఇవి కూడా చదవండి...
మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి
లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు
Read Latest Telangana News And Telugu News