Share News

జనసంద్రమైన నాగోబా..

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:33 AM

కేస్లాపూర్‌ నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా ఈ ఏరియాలోని ఆదివాసీలు పెద్దఎత్తున తరలిరావడంతో కేస్లాపూర్ అటవీప్రాంతం కిక్కిరిసిపోయింది. మంత్రి కొండా సురేఖతోపాటు జిల్లా అధికారులు జాతరకు విచ్చేశారు.

జనసంద్రమైన నాగోబా..

- నాగోబా జాతరకు పోటెత్తిన భక్తులు, ఆదివాసీలు

- ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి.. మంత్రి కొండసురేఖ

- అటవీశాఖ పని తీరుపై ఆదివాసీ సంఘ నేతల ఆగ్రహం

- ప్రజాదర్బార్‌కు డుమ్మాకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యేలు

- గట్టిబందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు

ఆదిలాబాద్‌/ఇంద్రవెల్లి: భారీగా తరలివచ్చిన భక్తులు, ఆదివాసీలతో కేస్లాపూర్‌ నాగోబా జనసంద్రంగా మారింది. సుమారుగా రెండు కిలో మీటర్ల మేరకు భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ర్టాల నుంచి భారీ ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నాగోబా జాతరలో భాగంగా మూడో రోజు గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన కనిపించింది. దర్బార్‌కు హాజరైన ఆదివాసీలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు మొర పెట్టుకున్నారు.


ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్‌ అధ్యక్షతన ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఈ దర్బార్‌కు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ రాజార్షిషా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌, ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్‌, మౌనిక, డీఎఫ్‌వో ప్రశాంత్‌బాజీరావ్‌పాటిల్‌ తదితరులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి గోండు, కోలాం, ప్రదాన్‌, ఆంద్‌, నాయక్‌పోడ్‌, తోటి, చెంచు, మన్నెవార్‌, కోయ ఆదివాసీ 9 తెగల ప్రజలు ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు.


zzzzzzzz.jpgదర్బార్‌కు సమీపంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆదివాసీల నుంచి శాఖల వారీగా దరఖాస్తులను స్వీకరించారు. గతేడు 546 దరఖాస్తులు రాగా ఈ సారి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.గతంలో కొన్నింటికి మాత్రమే పరిష్కారం చూపడంతో మళ్లీ అవే సమస్యలతో ఆదివాసీలు దరఖాస్తులు చేసుకున్నారు. దీని పై పలువురు ఆదివాసీ సంఘాల నేతలు జిల్లా అధికారుల తీరుపై మండిపడ్డారు.


అయితే ప్రజాదర్బార్‌లో ఏ ఒక్క శాఖ పరిధిలోని సమస్యపై చర్చించి పరిష్కారం చూపిన దాఖలాలు కనిపించలేవు. జిల్లా ఉన్నతాధికారులు దర్బార్‌కు పూర్తి సమాచారంతో సిద్ధమై వచ్చిన ఫలితం లేకుండానే పోయింది. కొన్ని శాఖల అధికారులు ప్రజా దర్బార్‌కు హాజరుకాక పోవడం చర్చనీయాంశంగా మారింది. నాగోబా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు గట్టిబందోబస్తును ఏర్పాటు చేశారు.చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నాగోబాకు తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.


ఆదివాసీలు కలిసికట్టుగా పండుగలు చేసుకోవడం అభినందనీయం: మంత్రి కొండ సురేఖ

zzzzzzzzzz.jpgఆదివాసీలు సాంస్కృతి సాంప్రదాయాలతో కలిసి కట్టుగా పండుగలు చేసుకోవడం ఎంతో అభినందనీయం. ఐక్యమత్యంగా ఉంటూ పలు సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకుంటున్నారు. దీంతో కక్ష్యపూరిత వాతావరణం ఉండదు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటూ గిరిజన గూడాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎదురవుతున్న అటవీ శాఖ అడ్డం కులను వెంటనే తొలగిస్తాం. దేశంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబానేనని తెలిపారు.


గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలెవరు నాగోబా ఆలయానికి రాలేదన్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు త్రిమేన్‌ కమిటీని నియమిస్తామన్నారు. నాగోబాకు ఉప ముఖ్యమంత్రి రావడం ఎంతో అదృష్టమన్నారు. గిరిజనులు చేసుకున్న దరఖాస్తులను శాఖల వారీగా కేటాయించి అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దేవాదాయ శాఖ పరిధిలోని సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ చట్టాలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అటవీ సమాచారాన్ని పరిశీలిస్తుందని పేర్కొన్నారు.


zzzzzzzzzzz.jpg

త్వరలోనే గిరిజన ప్రాంత ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు అధికారులను పిలిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏజెన్సీలో విద్యా అవకాశాలను మరింత మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అవసరమైన విద్య వసతులను కల్పించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. నాగోబా జాతరకు రూ.22కోట్ల నిదులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు పోలీసు స్టేషన్ల వరకు వెళ్లకుండా గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. నాగోబాఆలయం లో పని చేస్తున్న ఏడుగురు పూజారులకు దూపదీప నైవేద్యం కింద దేవాదాయ శాఖ నుంచి వేతనాలు మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం తొమ్మిది మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించారు.


అటవీ శాఖపై ఆదివాసీల ఆగ్రహం

ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అటవిశాఖ అడ్డంకులు కలిగిస్తుందంటూ ఆదివాసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్న అటవీ శాఖ అధికారులు అమలు చేయడం లేదన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పూర్తిగా అడవులపై ఆధారపడి జీవించే ఆదివాసీల ఉపాధి అవకాశాలను అటవీ శాఖ అధికారులు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అటవి ఉత్పత్తులను సేకరించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.


అటవీశాఖ అనుమతులు ఇవ్వక పోవడంతోనే ఏజెన్సీ మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని సరైన రోడ్డు మార్గాలు లేక అత్యవసరంలో వైద్యసేవలు అందక ఆదివాసీల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యేతో పాటు తుడందెబ్బ నాయకులు, ఆదివాసీ 9 తెగలకు సంబంధించిన నేతలు అటవీ శాఖ అధికారుల పని తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటుంన్నారని ప్రజాదర్బార్‌కు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు.


ప్రజాదర్బార్‌కు హాజరుకాని ఎంపీ, ఎమ్మెల్యేలు

ప్రతియేడాది నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటు చేసే ప్రజాదర్బార్‌కు ఎంపీ గోడంనగేష్‌తో పాటు బోథ్‌ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవలక్ష్మిలు హాజరుకాక పోవడం సభలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లా ఆదివాసీల సమస్యలకు పరిష్కారం చూపుతారని అందరు భావించిన ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకాక పోవడంతో ఆదివాసీలు నిరాశకు గురయ్యారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయలశంకర్‌ ప్రజాదర్బార్‌కు హాజరైన కొద్దిసేపటికే తిరిగి వెళ్లి పోయారు. దర్బార్‌ వేదికపై ప్రోటోకాల్‌ పాటించక పోవడం పలువిమర్శలకు దారి తీసింది. అధికారిక కార్యక్రమంలో కొంత మంది కాంగ్రెస్‌ నేతలు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి.

హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!

వైసీపీది భూ భక్ష పథకం

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2026 | 10:33 AM