వైసీపీది భూ భక్ష పథకం
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:01 AM
రాష్ట్రంలో భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ అబద్ధాలు, అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై విషాన్ని కక్కారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
రీసర్వేపై అబద్ధాలు, అసత్యాలతో విషం కక్కిన జగన్
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపాటు
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ అబద్ధాలు, అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై విషాన్ని కక్కారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజల ఆస్తులు కాజేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో 22ఏను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్ తెచ్చింది భూరక్ష పథకం కాదని, భూ భక్ష పథకమని విమర్శించారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘జగ్గయ్యపేట నియోజకవర్గంలో 2018లో టీడీపీ ప్రభుత్వం రీసర్వేను ప్రారంభించి, ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తెస్తూ గెజిట్ జారీ చేసింది. కానీ జగన్ మాత్రం తానే రీసర్వేను కనిపెట్టినట్టు, ఇప్పుడు తామేదో ఆయన క్రెడిట్‌ను చోరీ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. భూ హక్కు పత్రాలపై తన ఫొటో వేయించుకోవడానికి భూమి ఆయనదా? క్రిమినల్ క్రెడిట్ చోరీ తత్వం ఉన్న జగన్.. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారంటారా?’ అని అనగాని మండిపడ్డారు. ‘వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే తప్పుల తడకగా ఉన్నందునే కూటమి ప్రభుత్వానికి 2.70లక్షల ఫిర్యాదులు అందాయి. జగన్ ఇచ్చిన పాస్‌పుస్తకాల్లో ఒకటీ, రెండు తప్ప అన్నీ తప్పులే. పాస్ పుస్తకంపై భూమి వివరాలు, రైతు ఆధార్, ఫోన్ నంబరు, జీపీఎస్ వంటివి లేకుండా చేశారు. ఇప్పుడు భూమి లొకేషన్‌తో సహా 15 రకాల భద్రత అంశాలను జోడించి క్యూఆర్ కోడ్‌తో వివరాలన్నీ తెలిసేలా రాజముద్రతో రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.
భూముల విలువపై కసరత్తు చేస్తున్నాం
పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువకు, రిజిస్ర్టేషన్ విలువకు మధ్య వ్యత్యాసం ఉన్నచోట్ల భూముల మార్కెట్ విలువను పెంచే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. రాజధాని గ్రామాల్లో గతేడాది భూముల విలువ పెంచలేదని, దానిపై ఈ ఏడాది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎనిమిది పదుల వయసులో దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడం చంద్రబాబు క్రెడిట్ అయితే, గులకరాయి, కోడికత్తి, బాబాయి గొడ్డలి డ్రామాలు ఆడటం జగన్ క్రెడిట్ అని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులను కళ్లుండీ చూడలేని జగన్.. తన రాక్షస మనస్తత్వం వీడకపోతే ఈసారి 11 సీట్లలో 10 పోతాయని అనగాని వ్యాఖ్యానించారు.